KakatiyaPatrika.com Header Image

కాకతీయ కలగూర గంప -1

(ముసలి జంట మాటల చద్దిమూట)

***

“రామా విలాసూ, అలంకార్ టాకీసూ, కోహినూర్ హోటలూ…”

***

ఒక్క సారి 60 యేండ్లు వెనక్కి పోతే (అంటే 1960 వ దశకపు తొలి సంవత్సరాలలో) వరంగల్ అంటే ఓరుగల్లు ఖిల్లా, ఆజాంజాహీ మిల్లూ, భద్రకాళీ గుడీ!

  • హనుమకొండ అంటే వేయి స్థంబాల గుడీ. పద్మాక్ష్మమ్మ గుట్టా, ఆఫీసుల కేంద్రం, కాలేజీల కూడలి, టౌన్ హాలూ, పబ్లిక్ గార్దెన్ ఇంకా వేరే వూర్లకు పోయే బస్సులు బయలుదేరే బస్సు స్టాండు.
  • ఇక పోతే వరంగల్ నగర మూడో భాగం ఖాజీపేట అంటే రైల్వే జంక్షన్ ఇంకా మెట్టుగూడ రామలింగేశ్వరాలయం.
  • ఇంకా వరంగల్లు ఒక వ్యాపార కూడలి. స్కూల్ చదువుకు చెందిన విద్యాసంస్థల నిలయం, సినిమా థియేటర్ల కేంద్రం. పెండ్లికి బట్టలు కొనాలంటే బట్టల బజారుకు రావల్సిందే. సినిమా చూడాలంటే ఏ విక్టరీ టాకీస్ (తర్వాత లక్ష్మీ టాకీస్), ప్రభాకర్ టాకీస్ (తర్వాత రాజ రాజేశ్వరీ టాకీస్), లేదంటే చౌదరీ (రామా) టాకీస్, రైల్ పట్టాలు (రైల్వేగేట్) దాటి పోవాల్సిన మార్కండేయ (సరోజ్) టాకీస్ కు  రావసిందే! సర్కస్ చూడాలనుకుంటే పోచమ్మ మైదానుకు, నుమాయిష్ (అదేనండి ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే ఎగ్జిబిషన్) చూడాలంటే ములుగు రోడ్డు దాటి సెంట్రల్ జైల్ ముందు వున్న గ్రౌండుకు రావల్సిందే. ఇదీ అప్పటి వరంగల్ ముఖ చిత్రం.
  • ఇక హనుమకొండ అంటే ఆరోజుల్లో ఒక ప్రభుత్వ కార్యాలయాల కూడలి. ఇప్పటి అ శోకా హోటల్ ముందు వరంగల్ మున్సిపల్ ఆఫీస్ వుండేది. ఇక నక్కల గుట్టలో వున్న (వరంగల్ ప్రజలకు తాగు నీరిచ్చే ధర్మసాగర్ చెరువు నీటిని శుభ్ర పరచి నిలువ వుంచే) వాటర్ ట్యాంకూ, వెనకనే వున్న RTC డిపో, జిlla  కోర్టుల సముదాయం వున్న అదాలత్, కలెక్టర్ ఆఫీస్ వున్న సుబేదారీ. ఇక  హైదరాబాదుకో, వేరే దూరపు వూర్లకో పోవాలంటే ఇప్పటి హనుమకొండ చౌరాస్తాలో వుండే బస్ స్టాండుకు రావల్సిందే. ఆ మూలనే వున్న కొద్ది ఖాళీ స్థలంలో పాత అంబాసిడర్ టేక్సీలను పెట్టుకొని “హైదరాబాద్, హైదరాబాద్” అంటూ ప్రయాణికులను ఆహ్వానించే టేక్సీ డ్రైవర్లు కనబడే వారు. అప్పుడు హైదరాబాదుకు పోయే రోడ్డు సింగిల్ రోడ్డే.
  •  హనుమకొండ కూడా విద్యా సంస్ఠల నిలయమే. అప్పటికే  పేర్గాంచిన ప్రభుత్వ లష్కర్ బజార్ హై స్కూల్, మల్టీ పర్పస్ హై స్కూల్ వున్నా హైస్కూల్ విద్యకు వరంగలే ఆ రోజుల్లో ఫేమస్. ఐతే మెట్రిక్యులేషన్ తర్వాత కొనసాగించే కాలేజీ విద్యకు హనుమకొండనే  స్థావరం.  సుబేదారిలోనే వున్న ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధం. నేను 1965 లో పీ యు సీ ఇక్కడే చదివాను.
  • అప్పటి ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ మేజర్ అహ్మదుద్దీన్ గారు. మాకు సుప్రసన్నా చార్యులు గారు (తెలుగు), మొదలి నాగభూషణ శర్మ గారు (ఇంగ్లీష్), రామారావు సార్ (లెక్కలు), జనార్దన్ రెడ్డిగారు (కెమిస్ట్రీ) బోధించారు. శర్మ గారు నాటక రచయిత, నటుడు. ఇంకా చెప్పాలంటే నాటక రచన మీద ఒక అథారిటీ. ఆయన ఆస్కార్ వైల్డ్ రచన “హ్యాపీ ప్రిన్స్” కథకు సంబంధించిన పాఠం చెబుతూ డ్రామటిక్ గా ఉచ్ఛరించిన “Sparrow, sparrow, little sparrow…” పదాల విన్యాసం ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి.
  • హనుమకొండలో రెండు సినిమా టాకీసులుండేవి. విజయా టాకీస్ (ఎక్కువగా హిందీ సినిమాలు వచ్చేవి) ఇంకా జీ ఆర్ టాకీస్ (రేకుల షెడ్).  జీ  ఆర్ టాకీసుకు ఎక్కువగా ప్రజలు పోయే వారు కాదు.
  • కాబట్టి తెలుగు సినిమాలు చూడటానికి హనుమకొండ నుండీ, ఖాజీపేట నుండీ –ఇంకా చెప్పాలంటే చుట్టు ప్రక్కల గ్రామాల నుండీ వరంగల్ కు వచ్చే వారు. వడ్డేపల్లి నుండి  మా తులశమ్మ నాయనమ్మ కుటుంబం, నక్కలగుట్ట నుండి కాళోజీ కుటుంబ సభ్యులు ముందుగా మా ఇంటికి వచ్చి ఒకటో రెండు గంటలు గడిపి ఉపాహార చాయ్ కార్యక్రమాలు ముగించి ఆ తర్వాత సినిమాకు పోయే వారు. వీళ్ళు  సర్కస్ కు పోవాలన్నా అంతే…
  • వరంగల్ సినిమా ముచ్చట్లు వచ్చాయి కాబట్టి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతాను.
  • అప్పటి రాజ రాజేశ్వరీ టాకీసులో 1963లో ‘లవ కుశ’ చిత్రం ఒక సంవత్సర కాలం నడచింది. ఇది ఇప్పటికీ వరంగల్ లో ఒక రికార్డ్. ఈ సినిమా చూడటానికి 20 -30 కిలోమీటర్లనుండి గూడా గ్రామ ప్రజలు ఎడ్ల బండ్ల మీద చద్ది గట్టుకొని వచ్చి చూశారు.
  • అప్పటి చౌదరీ టాకీసు (తర్వాత రామా టాకీసు) లో ప్రముఖ జర్నలిస్టూ, సాహితీ వేత్తా, చిత్రకారుడూ చలసాని ప్రసాద రావు గారు (విపుల- చతుర ఫేం) కొంత కాలం (1959 దాకా అనుకుంటా) mEnEjar gaa పని చేసారు. ఆయన జర్నలిజం లో మా నాన్నకు శిష్యుడే, కాకతీయ పత్రికతో అనుబంధమున్నవాడే. మా ఇంట్లో ఎక్కువ కాలం మా నాన్న గారితో ఆ బంగ్లా రూం లో గడపిన వారే.
  • మా చిన్నప్పుడు (అంటే నాకు పదేండ్లు వచ్చే దాక) మా అమ్మా వాళ్లతో ఈ టాకీసు కు సినిమా చూడటానికి ఎప్పుడైనా  పోతే, ఇంకా తెరవని స్త్రీల ప్రత్యేక టికెట్ కౌంటర్ దగ్గర నిలబడ్దప్పుడు టాకీసు మేడపై పని నుండి ఒక వేళ ఆయన మమ్మల్ని చూస్తే వెంటనే కిందకు దిగి టికట్ లేకుండా మమ్మల్ని లోపలకు పంపించే వారు. (ఇది రెండు సార్లో మూడు సార్లో జరిగింది).
  • అప్పటి సినిమా టికెట్ రేట్లు: 6 అణాలు (37 పైసలు); 9 అణాలు (56 పై); 14 అణాలు (85 పై) మరియు రూపాయ్ పావలా ( రూ 1.25)
  • హాల్  వెనక వైపు వున్న (14 అణాలు, రూపాయ్ పావలా) హాలును ఒక నల్లని  తెరతో కర్టెన్ తో రెండు భాగాలుగా విభజించి ఈ రెండవ భాగం లో బెంచీల నమర్చి 6 అణాలు. 9 అణాలు టికెట్ తీసుకున్న స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వారు.
  • తాతల కాలం నుండీ వరంగల్ నగరంలోనే వున్న కుటుంబాలు వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అదే విధంగా నేత వృత్తికి సంబంధించిన ఇంకా బీడీ కార్మికుల కుటుంబాలు తరతరాల నుంచి కాశీ బుగ్గ, గిర్మాజీపేట్ ఏరియాలో కనిపిస్తారు.
  • చుట్టు ప్రక్కల వుండే గ్రామాల నుండి ఉద్యోగ రీత్యా లేదా పిల్లల చదువులకై వరంగల్ వచ్చి ఇక్కడేస్థిరపడ్డ వారు హనుమకొండలో వుండే వారు. ఇంకా న్యాయ వాదులు, కాలేజీ లెక్చరర్లు, ఉద్యోగులు ఎక్కువగా వుండేది హనుమకొండలోనే. భద్రకాళీ చెరువుకు దగ్గరగా వున్న కారణాన బెస్త కుటుంబాలు కూడా ఇక్కడె చాలా కాలంగా వుంటున్నారు.
  • ఇక పోతే వరంగల్ నగర మూడో భాగం ఖాజీపేట. ఇక్కడ రైల్వే జంక్షన్ వుండటం మూలంగా, స్టీం ఇంజిన్ల మరమ్మతు చేసే లోకో షెడ్ వుండటం మూలంగా దాదాపు ఖాజీపేట  అంటే రైల్ ఉద్యోగుల నివాస కేంద్రం. పైగా ఇప్పుడు రైల్వే పట్టాలపై ఫాతిమా నగర్ వద్ద వున్న వున్న రోడ్ బ్రిడ్జ్ (1977 ప్రాంతంలో) కట్టక ముందు అక్కడ ఒక రైల్వే గేట్ వుండేది.  అంటే ఖాజీపేట ను మిగతా వరంగల్ నగరం నుండి వేరు చేసినట్లుగా అనిపించేది. తర్వాత క్రమంలో రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ వచ్చిన పిదప ఇక్కడ అభివృద్ధిజరిగినా రైల్వే బ్రిద్జ్ నిర్మాణం పిదప ఖాజీపేట అభివృద్ధి గణనీయంగా జరిగింది.

***

ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్

*** 

  • ఇక శీర్షిక విషయాని కొద్దాం. నేనొక సారి మా పాలీటెక్నిక్  ప్రవేశ పరీక్ష సందర్భంగా మా టెక్నికల్ బోర్డ్ లో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నప్పుడు, ఒక నాటి సాయంత్రం అప్పటి సెక్రెటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో వరంగల్ ప్రస్తావన వచ్చింది. ఆయన అప్పటి రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ, ఖాజీపేట లో 1960 ప్రాంతాల్లో ఇంజినీరింగ్ (BE) చదివానని చెబుతూ అప్పుడప్పుడూ సినిమాను చూడటానికి ఖాజీపేట్ నుండి వరంగల్ వచ్చే వాళ్ళమని, అదేదో హోటల్ లో టిఫిన్ తినే వాళ్ళమని అది చాలా బాగుండేదని చెప్పారు.  ఆ హోటల్ పేరు అడిగి అది ఇంకా ఉందా అని అడిగారు.
  • ఆయన అడిగిన ఆ హోటలే అలనాటి ‘రామా విలాస్’.  35 సంవత్సరాల తర్వాత కూడా ఆయన దాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే రామా విలాసును కూడా వరంగల్ కు  ఒక సూచికగా తీసుకోవడం.  ఇంత కంటే మంచి ఉదాహరణ వుంటుందా?
  • వరంగల్ చౌరాస్తా నాలుగు మూలల్లో బట్టల బజారును కలిపే రోడ్డు, JPN రోడ్డు కలిసే మూలలో  ఒక పాత కాలపు భవనం మొదటి అంతస్తులో వున్నది రామా విలాస్. JPN రోడ్డు వైపునుండి సన్నని మెట్ల మార్గం మిమ్మల్ని ముందుగా చిన్న వరండాలాంటి క్యాషియర్ కౌంటర్ వైపు తీసుకు పోతుంది.  పక్కనే వున్న ద్వారం గుండా పెద్ద హాలు, దాన్ని దాటుకుని మరొక తలుపు ద్వారా చిన్న  బాల్కనీ లాటి మరొక గదీ వుంటాయి. హాల్ లో మరియు ఈ గదిలో అమర్చిన టేబుల్లు కుర్చీలు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాయి
  • సాంబార్ గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్న వరంగల్ జనానికి రామా విలాస్ లో ఇడ్లీ, వడ, దోశతో బాటు ఇచ్చే అమృతం లాంటి ఆ రుచికర సాంబారు ను వారు వదులుతారా?  కాబట్టి ప్లేట్ (రెండు ఇడ్లీలు) తో బాటు చిన్న సాసర్లో ఇచ్చే సాంబారు వారికి సరి పోతుందా?
  • మరో రెండుసార్లో/ మూడు సార్లో ఆ సాసరును సాంబారుతో ఆ సర్వర్ నింపవలసిందే, దాన్ని ఈ ఇడ్లీ సాంబార్ ప్రియుడు ఖాళీ చేయాల్సిందే! ఇక వడ ఐనా, వుల్లిపాయ దోశ ఐనా (వాటితో బాటు) మూడు సాసర్ల సాంబారు కావల్సిందే…  
  • రుచి  అమోఘం – జనాదరణ అత్యంతం: సాయంత్రం 4 నుండి 9 గంటల దాకా విపరీతమైన రద్దీ. బట్టల బజరులోని వస్త్రాలయాలు, JPN రోడ్ పై గల షాపులు మూసి వేశాక అందులో పనిచేసే వాళ్ళు, యజమానులు ఇక్కడే కాసేపు తిష్ట.  ఇక్కడ కాఫీ రుచి  గూడా చాలా బాగుండేది.  అన్నట్టు ఆ రోజుల్లో ప్లేట్ ఇడ్లీ/వడ  ధర 10 నయా పైసలు. దోశ ఇరవై పైసలు. టీ 10 పైసలు; కాఫీ 12 పైసలు. రామా విలాసు కు పోటీగా ఎన్ని హోటల్లు ఆ ప్రాంతంలో వచ్చినా రామా విలాసుకున్న ప్రాముఖ్యత  తగ్గ లేదు.  ఆ రోజుల్లో అది వరంగల్ ప్రజలకు నంబర్ వన్ శాఖాహార ఉపాహార శాల.  అందుకే వరంగల్ కు వున్న పర్యాయ పదాల్లో రామా విలాస్ ఒకటి.

***

మొట్ట మొదటి ఆంగ్ల చిత్ర ప్రదర్శన శాల – అలంకార్ టాకీస్

***

  • 1966 కు ముందు వరంగల్ లో 5 (శ్రీనివాస్, లక్ష్మి, రాజ రాజేశ్వరి. రామా, సరోజ్) సినిమా టాకీసులు , హనుమకొండలో రెండు (విజయా; జీ ఆర్) టాకీసులు వుండేవి. టికట్ ధరలు 6 అణాలు (37 పైసలు)’ 9 అణాలు (56  పైసలు); 14 అణాలు (88 పైసలు); రూపాయ్  పావలా ( Rs. 1.25). ఫాత కాలపు కుర్చీలు…  ఐతే అతి తక్కువ ధర (37 పైసలు) వున్న తరగతి లో కూడా బెంచులు వుండేవి. అంటే నేల తరగతి వుండేది కాదు. బుకింగ్  కౌంటర్లు గూడా ఒక క్రమ పద్ధతి లో లేకుండా కుమ్ములాటలు, తోసి వేతలు… బలవంతుడిదే ముందు టికట్.  టికెట్ల పై సీట్ నంబర్ వుండేది కాదు. 37 పైసల టికేట్ తో ఎన్ని సినిమాలు ముందు వరస బెంచీల మీద కూర్చొని మా గుజరాతీ మిత్రులతో (ప్రవీణ్, మహేష్, హిమ్మత్ లాల్, భుపేందర్) కలసి ఆ రోజుల్లో (HSC దాకా) చూశానో…
  • 1965-66 ప్రాంతాల్లో రెండు కొత్త థియేటర్లు కట్టడం మొదలైంది.  ఒకటి మా ఇంటికి దగ్గరలోనే మట్టెవాడ పోలీసు స్టేషన్ ప్రక్క సందులో ‘దుర్గా కళా మందిర్”; మరొకటి ములుగు రోడ్డు దాటాక భద్రకాళి  చెరువు నుండి వచ్చే కాలువ పై కట్టిన బ్రిడ్జ్ దాటాక ఎడమవైపు, దీని పేరు  ‘అలంకార్ టాకీస్’.
  • వీటిలో ‘అలంకార్’ ముందుగా ఓపెన్ అయింది (1966 లో అనుకుంటా). మొదటి చిత్రం ఇంగ్లీష్ మూవీ  ‘Arabesque’.
  • తర్వాతన్నీ ఇంగీష్ సినిమాలే… దగ్గరనే వున్న కాకతీయ మెడికల్ కాలేజీ, దూరంగా వున్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, దానికి ఇవతలనే వున్న ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ   విద్యార్థులకు, స్టాఫ్ కు (ముఖ్యంగా తెలుగువారు కాని వాళ్ళకు) ఇది ఒక పండగే. ఇంకా పాలీటెక్నిక్ టీచర్లకు, విద్యార్థులకు, డాక్టర్లకు, లాయర్లకు ఇతర విద్యాధికులకు  ఈ కొత్త ప్రయోగమొక వరం లాగా ఐంది. అన్నిటి కంటే ముఖ్యంగా టికెట్ మీద సీట్ నంబర్ సూచించిన మొదటి థియేటర్ వరంగల్ లో అలంకార్ టాకీస్.
  • ఆ విధం గా అలంకార్ టాకీసు అన్నది అప్పటి రొజుల్లో  ఒక ట్రెండ్ సెట్టర్. అందుకే దీన్ని శీర్షికలో చేర్చాను. నేడు అలంకార్ టాకీసు లేదు. ఐనా  ఆ సెంటర్ పేరు అలంకార్ సెంటర్. (నేను అలంకార్ టాకీసులో చూసిన కొన్ని  సినిమాలు, Arabesque, The Dirty Dozen, The party, African Safari, Where Eagles Dare, Hatari, james Bond films ‘Dr, No and ‘Gold Finger” ;…)

***

కాలేజీ విద్యార్థుల కాలక్షేప కూడలి ‘కోహినూర్ హోటల్’

***

  • హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే  ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని  లోంచి లోపలకు పోతే  ముందుగా కొద్దిగా  ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా కొంచం ఎత్తులో వుండే భవనమే కోహినూర్ హోటల్. నాలుగైదు మెట్లెక్కితే వరండా, ఆ వెనకాల పెద్ద హాలూ. ఇందులో లభ్యమయ్యేవి బిస్కట్లూ, బన్ మస్కా, సమోసాలు. బిర్యానీ, కప్పులో చాయ్ లేదా పౌనా.  ఒక చాయ్  కప్పు తాగి అర్ధ గంట గప్పాలతో కాలాన్ని  అత్యుత్సాహంగా గడిపే కాలేజీ విద్యార్థులకు కాలక్షేప కేంద్రం. అలనాటి హనుమ కొండ నివాస విద్యార్థులకు ఇతర కాలక్షేప రాయుళ్ళకూ  ఇది అనుభవమే… 
  • అందుకే హనుమకొండ వాసులకు కోహినూర్ హోటల్ ఒక వారసత్వ సూచిక, 

***

త్వరలో  … కాకతీయ కలగూర గంప -2

“అల నాటి రవివర్మ – మొన్న మొన్నటి  బిట్ల నారాయణ” 

***

రచన : శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు

2 Comments

  1. Ranga Rao Mattewada says:

    Very nostalgic, like living my childhood days all over again!

  2. Kondal Rao says:

    Absolutely amazing write up. I was in BSc 1 year in 1965. I was. My home was in Hunter road, that road had exactly 11 houses + few huts. Rao Saab your write up kindled my nostalgic memories. I follow your paper and will write in Telugu next time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami