***
కాకతీయ కలగూర గంప -1
***
మన ‘కాకతీయ కలగూర గంప’లో మొదటగా మనకు అత్యంత ఆహ్లాదకరమైంది, మనకన్ని రుచులను కలగజేసి మన జీవిత పయనంలో ఒక మంచి బాటను వేసిన ‘బడి’గురించి చెప్పడం ఒక మంచి ప్రారంభ సూచిక అని భావిస్తున్నాను.
• ఫ్రతి మనిషి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో జరిగినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య నిర్మాణ పద బంధ రూపాన్ని, వ్యాకరణ స్వరూపాన్ని ఇచ్చేది; ఇంకా… అంకెలను సంఖ్యల్లోకి, సమీకరణాలలోకి పెంపొందించేదీ , చారిత్రిక సంఘటనలనూ, భౌగోళిక రూపు రేఖలనూ, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్ర సిద్ధాంతాల నిత్య సత్యాలను మన బ్రతుకు రక్తంలోకి ఎక్కించేది ఇక్కడే. అదే మాధ్యమికోన్నత పాఠశాల.
• 6వ తరగతి నుండి HSC (ప్రస్తుతం SSC) దాకా చదువుకున్న ప్రతి విద్యార్ఠీ ఆ కాలపు తన బడి జీవితాన్నీ, అప్పటి మిత్ర బృందాన్నీ మరిచి పోలేని ఒక అద్భుత అనుభూతినిచ్చే ప్రీతికరమైన అనుభవాల సమ్మేళనం..
• మంచీ, చెడూ అప్పుడప్పుడే తెలుస్తున్న పదేండ్ల బాల్యంలో 6వ తరగతిలో ప్రవేశించి, నూనూగు మీసాల 16 ఏండ్ల వయస్సులో 11వ తరగతి (ఆ రోజుల్లో) అంటే హెస్. యెస్. సి. రాష్ట్ర స్థాయి పరీక్షను రాయడం జరిగేది ఈ టైంలోనే. మొట్టమొదటి సారిగా మనకు ఎప్పుడూ మరచిపోలేని స్నేహితులేర్పడటం జరిగేది ఇక్కడే!
***
చందా కాంతయ్య బడి – మొట్ట మొదటి అపురూప దేవాలయం
***
• చందా కాంతయ్య గారంటే ఒక మహోన్నత నిరాడంబర ధనిక వ్యాపారి. ఉదార దాన శీలి. ఆయన గొప్పదనం గురించి ఎన్నో నిజాలున్నయి. కాళోజీ గారు చెప్పిన ఒక ఉదంతం మీకు వివరిస్తాను. ఏదో సందర్భంలో చందా కాంతయ్య గారిని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఆయన్ను టాపు లేని ఒక కారులో ఊరేగిస్తున్నారు.
• ఆ జనంలో మన కాళోజీ గారు కూడా వున్నారు. మధ్య, మధ్యలో ‘చందా కాంతయ్య గారికీ’ అంటే జనమందరూ ‘జై’ అని నినదిస్తున్నారు.
• ఆ క్రమంలో చందా కాంతయ్య గారు కూడా చేతులు పైకెత్తి ‘జై’ అంటున్నట్టు కాళోజీ గారు గమనించారు. ‘ఇదేమిటీ, ఈయన తనకు తాను జై కొడుతున్నాడేంటీ!’ అని ఆశ్చర్యబోయిన కాళోజీ గారు కారుకు దగ్గరగా పోయి ఆయన్ను నిశితంగా గమనించారు.
• అప్పుడు తెలిసిందేమిటంటే అందరూ చందా కాంతయ్య గారి పేరెత్తినప్పుడు ఆయన మాత్రం తన తండ్రి పేరు ఉచ్ఛరించే వారంట.
• అంటే ఆయనకు అందరూ జయధ్వానాలు పలుకుతుంటే ఆయన వాటిని తన తండ్రి గారి పేరుకు బదలాయిస్తున్నారన్నమాట.
• అంతటి మహోన్నతుడు, అలనాటి నిజాం కాలంలో (సరిగ్గా తెలియదు కాని 1940 ప్రాంతాల్లో) వరంగల్ నగరంలో ఒక బడిని –అదీ తెలుగు మాధ్యమంలో- ప్రారంభించాలనుకున్నారు.
• ఎవరి సలహాలు తీసుకున్నారో ఏమో గానీ అది వరంగలుకు మొట్ట మొదటి విద్యా తులసి చెట్టైంది.
• దాని పేరు కూడా ఎంత అద్భుతంగా వుందో గమనించండి. ‘ఆంధ్ర విద్యాభివర్ధని బహుళార్ఠ సార్ఠకోన్నత పాఠశాల’.
• సింపుల్ గా దాన్ని ఏ వీ హైస్కూల్ అనే వాళ్ళం.
• ఆరోజుల్లో స్కూల్ ఫైనల్ అంటే 11వ తరగతి (HSC). ఐతే అప్పటికే హనుమకొండలో ఎప్పుడో నిజాం ప్రభుత్వం నెలకొల్పిన ప్రభుత్వ బహుళార్ఠ సార్ఠకోన్నత పాఠశాల వుంది కాబట్టి, ఏ వీ హై స్కూలును గూడా బహుళార్ఠ సార్ఠకోన్నత పాఠశాలగా ఏర్పరచారు.
• ఇందులో 12 వ తరగతి వరకు ఉండి అప్పుడు పబ్లిక్ పరీక్ష (దీన్ని మల్టీ పర్పస్ HSC అంటారు) రాయాలి. ఇది పాసయితే కాలేజీ లో పీ యూ సీ చదవకుండా నేరుగా డిగ్రీ లో జాయిన్ కావచ్చు.
• పేరు ఏ వీ హైస్కూల్ ఐనా అందరూ అనేది ‘చందా కాంతయ్య బడి’.
• పేరే కాదు – ఈ పాఠశాల గురు బృందాన్ని తెలుసుకుంటే ఆ మహోన్నత వ్యక్తి గొప్ప ఆలోచనా విధానం తెలుస్తుంది.
• ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ యద్దనపూడి కోదండ రామశాస్త్రి గారు.అందరూ అనేది వై కె శాస్త్రి గారు అని.
• శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సోదరుడు శ్రీ విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు కూడా చాలాకాలం ఆ స్కూల్ లో పనిచేసారు. ఇంకా శ్రీయుతులు కొండల్ రావు సార్ (లెక్కల సార్), సుబ్బారావు సార్, హరి రాధాకృష్ణ మూర్తి సార్, సోమేశ్వర రావు సార్, శ్రీనివాస మూర్తి సార్, — ఇంకా ఎందరో మహొన్నత గురు ప్రముఖులు.
• ఐతే ఆ పాఠశాల ప్రారంభ సంవత్సరాలలో పని చేసిన ప్రముఖుల్లో భండారు చంద్రమౌళీశ్వర రావు గారు, పాములపర్తి సదాశివ రావు గారు, బాజారు హన్మంత రావు గారు వున్నారు.
• ప్రముఖ సాహితీ మేధావులు కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్యగార్లు అలనాటి (1950 ల నాటి) ఏ వీ హై స్కూల్ విద్యార్థులే. మా మిత్రుడు, మొన్ననే పరమపదించిన రిటైర్డ్ IAS అధికారి ముదిగొండ వీరభద్రయ్య గారు 1964 విద్యార్థి.
• నేను ఆ స్కూలు లో చదవలేదు కాబట్టి – ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కాని పైన పేర్కొన్న మహనీయులలో వశిష్టులను పోలిన ఋషితుల్యుడు శ్రీ హరి రాధా కృష్ణ మూర్తి గారి గురించి తప్పక తెలపాల్సిన బాధ్యత నా మీదుంది. ఆయన్ను గురించి మరెప్పుడైనా… భద్రకాళీ మాతకు అలనాటి ఉగ్ర రూపాన్ని మార్చి నేటిేి ప్రశాంత సుందర ముఖ వర్చస్సు తో మనను ఆశీర్వదించే రూపాన్ని కలిగించడంలో (1940 ప్రాంతాల్లో) ఆయన ముఖ్య కారకుడు. ఆ మహనీయ మూర్తి నాకు దైవ స్వరూపుడు. ఆనా టి భద్రకాళి దేవాలయ ప్రధాన (మరియు తొలి) అర్చకుడు శ్రీ గణపతి శాస్త్రి గారికి గురు తుల్యులు శ్రీ హరి రాధా కృష్ణ మూర్తి గారు.
• మా చిన్నప్పుడు (1956 నుండి 1960 దాకా) మజీదు ఇవతల పాత భవనం లో నడచిన ఆ స్కూల్ లో మిత్రుడు, సోదర తుల్యుడు సనత్కుమారుడి తో పోయి మొదటి సారిగా 16 mm ప్రొజెక్టర్ ద్వారా చూపించిన ఆ వాల్ట్ డిస్నీ కార్టూన్ ఫిల్ములను ఎంతొ ఎంజాయ్ చేసామో!
• తర్వాత ఇప్పటి కొత్త భవనం 1962-63 లో పూర్తైందనుకుంటా. ఆ భవనం వెనక ఖాళీ స్థలం లో (గ్రౌండ్ అనుకోండి) మిత్రులు నరసిం హారావు కేప్టన్ గా – మదన్, భుపేందర్, జ్యోతీ (జ్యొతేంద్ర నాథ్), హిమ్మత్ లాల్, లింగ మూర్తి, ప్రవీణ్, మహేష్, చేతన్, హేమంత్ మొదలగు మిత్రులతో మాMCC (మట్వాడ క్రికెట్ క్లుబ్) పేరుతో ఎన్ని ఆదివారాలు అక్కడ క్రికెట్ ఆడామో — మరచి పోలేని మధుర స్మృతులు..
• అన్నట్టు, ఇదే కొత్త భవనం లో 1964 లో మా మహబూబియా విద్యార్థులకు HSC పరీక్ష కేంద్రం. ఇక్కడే పరిక్ష రాసా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా.
***
( అభినవ దాన కర్ణ, అమూల్య విద్యా దాత శ్రీ చందా కాంతయ్య గారికి అలనాటి ఏ వీ హైస్కూల్ ఉపాధ్యాయ బృందానికి నమస్సుమాంజులతో…)
***
(త్వరలో – కొన్ని రోజుల తర్వాత నేను చదువుకున్న “మరొక చదువుల గుడి- బాజారు హన్మంత రావు బడి”)
***
పాములపర్తి నిరంజన్ రావు (Face book posting on 9th September, 2018)
Good.information.ykm
mee jnaapakaalaku joharlu