KakatiyaPatrika.com Header Image

వరంగల్ జిల్లాలో రాజకీయ – సాంఘిక పరిణామాలు  (1939-1950)

– పాములపర్తి  సదాశివరావు 

భారత దేశంలో రెండు వందల ఏండ్ల బ్రిటిషు సామ్రాజ్యవాద వలస పరిపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం అనేక రూపాలలో విజృంభించింది.  

కేవలం బ్రిటిష్ ఇండియా ప్రాంతంలోనే కాకుండా స్వాతంత్య్ర పోరాటం ఆయా స్వదేశీ సంస్థానాలలో కూడా కొనసాగింది. నిజామ్ రాష్ట్రంలో ఆర్య సమాజం, ఆంద్ర మహాసభ, కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమాలు జాతీయ స్వాతంత్య్ర కొరకై వీరోచిత ఆందోళన ను నిర్వహించాయి. వీటితో బాటు వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, విద్యార్థి సంఘాలు, కూడా స్వాతంత్య్ర సంగ్రామంలో పరోక్ష పాత్ర నిర్వహించాయి. 

నిజాము పాలకుడు మ. ప. ప. మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను మొగలు సామ్రాజ్యానికి వారసుడిని అని భావించేవాడు. 85 శాతం హిందువులు కల రాజ్యం లో 85 శాతం ఉద్యోగాలు మహమ్మదీయులకే లభించాయి. ఉర్దూ భాషకే  ప్రాముఖ్యం ఉండేది. 

నిజాము పరిపాలన భూస్వామ్య వ్యవస్థను ప్రతీక. జాగీర్దారులు, సర్దేశముఖులు, దేశముఖులు, పటేల్, పట్వారీలు గ్రామాలలో నిరాంకుశాధికారాలు చెలాయించేవారు. వెట్టి చాకిరీ ,  నానా విధాలా మామూళ్లు అధికంగా ఉండేవి. గ్రామాలలో విద్య, ఆరోగ్యం వీటిని అశ్రద్ధ చేసేవారు. పెద్దల ద్వారా భూస్వాములు తమ కులాలు వారిని (వారిని) అనేక  విధాలుగా  అదుపులో పెట్టేవారు. నియమోల్లంఘనం చేసేవారిని వెలివేసి కష్టపెట్టేవారు. గ్రామాలలో పెద్దవారు ఆయుధాలు, పరివారం వగయిరా హంగులు కలిగి  అధికారులలో ముస్లిములు, ఉత్తరాది నుంచి వలస వచ్చిన కామస్తులు (కాయస్థులు) అధిక సంఖ్యలో ఉండేవారు. 

అఘోరనాథ్ ఛటర్జీ 

హైదరాబాదు లో కాంగ్రెసు ఉద్యమాన్ని మొదట నిర్వహించినవారు శ్రీమతి సరోజినీ  నాయుడు తండ్రి గారయిన శ్రీ అఘోరనాధ్ ఛటర్జీ. ఆ పిదప 1945 దాకా నిజాము రాజ్యంలో కాంగ్రెసు ఉద్యమం నిషేదానికి గురి అయింది. దరిమిలా  తెలంగాణా ప్రాంతంలోని జాతీయవాదులందరూ ఆంద్ర మహాసభలో పనిచేసేవారు – మాడపాటి హనుమంతరావు , బూర్గుల రామకృష్ణరావు , కొండా వెంకట  రంగారెడ్డి, మందుముల నర్సింగరావు, మాదిరాజు రామకోటేశ్వరరావు  , సురవరం ప్రతాపరెడ్డి మున్నగు జాతీయ నాయకులందరూ ఈ కోవకి చెందినవారే. 

వీరితో బాటు  యువతరానికి చెందిన శ్రీ జమలాపురం గోపాలరావు, రావి  నారాయణరెడ్డి,కాళోజి   నారాయణ రావు,కోదాటి  నారాయణరావు,బొమ్మకంటి సత్యనారాయణ రావు,  సర్వదేవర భట్టు రామనాధం , బి. ఎస్ . గుప్త, దాశరధి కృష్ణమాచార్య మున్నదగువారు ఆంధ్ర మహాసభ వేదిక పై అశేష జనాన్ని ఆకర్షించేవారు .

ఆ రోజుల్లో వరంగల్ సూబా (రాష్ట్ర ) కేంద్ర నగర స్థాయిని  కలిగి ఉండేది. ఇక్కడ  ప్రముఖ న్యాయవాదులయిన జమలాపురం గోపాలరావు,   పదసా రంగారావు, వేముగంటి రత్నాకర రావు, తూము రంగయ్య , తూము వరదరాజులు, కాళోజి రామేశ్వర రావు , ఉదయరాజు రాజేశ్వర రావు, చెరుకు కాంతయ్య మున్నగు ప్రముఖులు ఆంద్ర మహాసభ నాయకులుగా ప్రముఖ పాత్ర నిర్వహించారు. 

వీరి కృషి ఫలితంగా వరంగల్ లో శబ్దానుశాసన గ్రంధాలయము, హనుమకొండ లో రాజనరేంద్ర గ్రంధాలయం, మడికొండ లో ప్రతాపరుద్ర గ్రంధాలయం వంటి సంస్థలు స్థాపితమయినాయి. 

ఆంద్ర మహాసభ వేదిక ద్వారా సాంఘిక సంస్కరణలకును, రాజకీయ రాయితీల కొరకును , బాధ్యతాయుత ప్రభుత్వ సాధన కొరకును ఆందోళనలుజరిపేవారు . సభలకు  తీసికోవలసి వచ్చేది. సవాహలలో జరిగే రాజకీయ తీర్మానాల పటాలకు కూడా జిల్లా అధికారుల ఆమోదం అవసరం అవుతూ ఉండేది. కొన్ని సందర్భాలలో మైనారిటి వర్గానికి చెందిన ముస్లిం సోదరుల అభ్యంతరాల వలన నిషేధాలు వెలువడుతూ ఉండేవి. వారి ప్రతినిధి బహద్దూర్  యార్ జంగ్ మహమ్మదీయేతరుల ఉద్యమాలను వ్యతిరేకిస్తూ ఉండేవారు.        

అణా చందా 

1920లో ఆకారపు చెన్నయ్య , డాక్టర్ శివలెంక  రాజలింగం,మాదిరాజు రామకోటేశ్వర రావు , ఉదయరాజు వెంకటేశ్వర రావు, మున్నగు ప్రముఖులు వరంగల్ మార్కెట్ కు వచ్చు ప్రతి బండీ వద్దనూ ఒక అణా చందా వసూలు  చేసి త్రిలింగాయుర్వేద పీఠమును , ఒక గోరక్ష శాలను నిర్వహించుటకు తాలూక్దార్ వద్ద అనుమతి పొందినారు. ఈ సంస్థలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు డాక్టరు గా పనిచేశారు కానీ అభిప్రాయం బేధముల వలన అది త్వరలోనే అంతరించింది. 

1932 లో వరంగల్ కాకతీయ కాన్ఫరెన్స్ అనే పేరుతో ఒక సమావేశం జయప్రదంగా జరిగింది. నిర్వాహకులు ఆంధ్ర చరిత్ర పరిశోధక మండలివారు.  ఇటవంటి సందర్భాలలో జాతీయ భావోత్తేజన  కనపడుతూ ఉండేది. అధికారులు సయితం సానుభూతి తోనే వ్యవహరించేవారు. 

వరంగల్ లో ఏటేటా గణపతి విగ్రహ నిమజ్జనం జరిగేది. 1939 లో స్థానిక ముస్లిములు దీని విషయమై అభ్యంతరం కల్పించారు. వూరేగింపు నడి  దారిలో నిలిచిపోవలసి వచ్చింది. కొందరు హిందూ యువకులు గాయపడ్డారు. చివరికి తమ వూరేగింపూ మార్గాన్ని మార్చుకోడానికి హిందువులు ఒప్పుకోవలసి వచ్చింది. మతద్వేషాలు పెరిగాయి. ప్రభుత్వం పట్ల నిరసన భావం వ్యాపించింది. ఆ రోజులలోనే శ్రీ చందా కాంతయ్య గారు లక్ష రూపాయల విరాళంతో ఆంధ్ర విద్యాభివర్ధిని ఉన్నత పాఠశాలని స్థాపించారు. 

అప్పుడు సంస్కృత పాఠశాలలు, ఆయుర్వేద కళాశాలలు నిర్వహించడాన్ని జాతీయాభిమానానికి ప్రతీకలుగా భావించేవారు. వరంగల్ లో శ్రీ ముదిగొండ శంకరశాస్ట్రీ గారును, శ్రీ ముడుంబై రామానుజాచార్యులు గారును రామన్నపేట సంస్కృత పాఠశాల మరియూ సింహాద్రి భోగ్ సంస్కృత పాఠశాలను నిర్వహిస్తూ ఉండేవారు. శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రి గారు ఆయుర్వేద వైద్య శిక్షణ తరగతులను నడుపుతూ ఉండేవారు. 

1942 లో ఆంధ్ర మహాసభ లో విబేధాలు పొడసూపాయి. ఇవి జాతీయవాదులకూ, కమ్యూనిస్టులకూ మధ్య వచ్చాయి. ధర్మారం (వరంగల్) లో శ్రీ మాడపాటి రామకోటేశ్వర రావు అధ్యక్షతన నవమాంధ్ర మహాసభ జరిగింది. అప్పుడే భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగింది. ధర్మారం సభ అనంతరం ఆంధ్ర మహాసభ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒక శాఖకు జాతీయ వాదులు , మరొక శాఖకు కమ్యూనిస్టులూ నాయకత్వం వహించసాగారు. 

తిరిగి 1946లో గాని నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ మీద ఆంక్షలను తొలిగించలేదు. అప్పుడే జాతీయాంధ్ర సభ ప్రముఖులందరూ స్టేట్ కాంగ్రెస్ సంస్థలో చేరిపోయారు. 

ఉద్యమాలు 

కమ్యూనిస్టు యువకుల కృషి మూలముగా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలలో కార్మికోద్యమం , విద్యార్ధి యువజన సంఘటన గణనీయంగా కొనసాగాయి. ఆజాం జాహి మిల్స్ కార్మిక యూనియన్, బీడీ ఖమీక యూనియన్ నిర్మించారు. శ్రీ టీ . ఎల్ . నరసింహ రావు, రాజలింగమూర్తి, మాటేటి కృష్ణమూర్తి ఏంతో కృషి చేశారు. 

మరొక దిశన శ్రీ ఎం . ఎస్ . రాజలింగం సర్వోదయ ఉదయమాన్ని నిర్వహించారు . ఇందులో శ్రీ భూపతి కృష్ణమూర్తి, శ్రీ రామ్ చంద్రమౌళి , ముస్త్వాల  శంకర రావు , రంగనాయకులు , దుగ్గిసెట్టి  వెంకటయ్య మున్నగువారు నిర్మాణ కార్యకర్తలు గా ఉండేవారు. 

ఆర్యసమాజం సంఘటన లో శ్రీయుతులు చెరుకు కాంతయ్య, ఇటికెల మధుసూదన్ , పళ్ళ రామకోట్ ఆర్య, దేవరకొండ చంద్రమౌళి గారాలు ప్రముఖ పాత్ర నిర్వహించారు.   హనుమకొండలోను , వరంగల్ లోను ఏటేటా గజానన చవితి సందర్భాలలో వేలాది ప్రజానీకం తో ఉత్సాహంగా ఊరేగింపులు జరిపించేవారు. 

ఆ రోజులలో శ్రీ యుతులు రాయపు రాజు రామారావు , కక్కెర్ల కాశీనాధం , దేవులపల్లి దామోదర రావు మున్నగు యువకులు కాకతీయ కళా సమితి ద్వారా నాటకాలు , గానసభలు, కవిసమ్మేళనాలు నిర్వహించేవారు. వీరి కార్యకమాలకి ప్రభుత్వాదరణ లభించకపోవటంతో వర్తక ప్రముఖులు తగినంత ధన సహాయం చేస్తుండేవారు. కార్యక్రమాలు బాగా జరుగుతుండేవి. 

1947లో వరంగల్ లో ఒక దారుణమయిన సంఘటన జరిగింది. వరంగల్ కోట ప్రాంతంలో కాంగ్రెసు పతాకానికి వందన సమర్పణ జరుగుతుంది. స్థానిక మహమ్మదీయులకి ఆగ్రహ కారణం అయ్యింది. వారు ఒక వూరేగింపు చేశారు. ఆ సందర్భంలో బత్తిని మొగులయ్య అనే కార్యకర్తను ఈటె తో పొడిచి చంపివేశారు. ఎం. ఎస్. రాజలింగం , బి. హెచ్. చంద్రమౌళీశ్వర రావు మున్నగు కాంగ్రెసు కార్యకర్తలు ప్రాణాపాయానికి గురి అయి ఎలాగో తప్పించుకున్నారు. హత్య చేసినవారి మీద ప్రభుతవం చర్య తీసుకోలేదు. పైగా శ్రీయుతులు కాళోజి నారాయణరావు, ఎం. ఎస్. రాజలింగం, హయగ్రీవాచార్యులు వరంగల్ ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినారు. నగర ప్రజలలో కలవరపాటు పెరిగింది. 

1948లో సత్యాగ్రహాలూ మొదలయినాయి . స్టేట్ కాంగ్రెసు వారు నిజాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీటిని ప్రారంభించారు. సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చెయ్యాలన్న పిలుపు వచ్చింది. 

రాష్ట్రంలో కాంగ్రెసు , కమ్యూనిస్టు, ఆర్య సమాజం మున్నగు పురోగామి శక్తులను ఎదుర్కోవటానికి ముస్లిం వర్గీయులు శ్రీ ఖాసీం రాజవి నాయకత్వాన రజాకార్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ముఖ్యమయిన దినం 

జూన్  14, 1948 ఒక ముఖ్యమయిన దినం. ఆనాడు వరంగల్ లోని ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలో ఆర్య సమాజంవారు తమ కార్యాలయం మీద జండా ఎగురవేశారు. కోపం వచ్చి ముస్లింలు వారిపైన సాయుధంగా దాడి జరిపిన ఘర్షణ లో ఇరు పక్షాలలకూ చెందిన అయిదారుమంది మరణించారు. ఉద్రిక్తత తీవ్రస్థాయికి అందుకున్నది. మరునాడు హిందువులు సాయుధులై ఉర్సు కరీమాబాదు నుంచి రంగశాయిపేటకు వూరేగింపు తీశారు. ఇందులో చేనేత నాయకుల ప్రాధాన్యం అధికంగా ఉండినది. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో వీరు ఆత్మరక్షణ కొరకై నాటు బాంబులు మొదలైన ఆయుధాలను సమకూర్చికొనినారు. ఇటీవల మాణిక్యరావు ఆర్య సమాజం కమాండర్ గా కాశీబుగ్గ ఉర్సు కరీమాబాదు, వరంగల్ కోట ప్రాంతాలలో స్వచ్చంద దళాల సంఘటనను నిర్వహించినారు. కుసుమ నరసయ్య , పరిమళ నర్సయ్య, గుండు మల్లేశం, మాచేటి రామస్వామి చేనేత నాయకులలో ప్రముఖులు. నగరంలో రజాకారులు రెచ్చిపోయారు . హిందువుల మీద దాడి చేయడానికి సంకల్పించారు. 

రజాకారులు సాయుధులై ఒక వూరేగింపు తీశారు. ఎల్లమ్మ బజారులో ఒక దుకాణాన్ని దోచుకున్నారు. డాక్టరు నారాయణ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయనను పొడిచి చంపారు. దారిలో ఒక టాంగా గుర్రాన్ని చంపారు. ఆర్య సమాజ మందిరం మీద విధ్వంసకాండ జరిపారు. ప్రముఖ వర్తకుల ఇండ్ల ముందు తుపాకులు పేల్చారు. వీధులలో రంకెలు వేస్తూ వీరవిహారం జరిపారు. 

ఈ అరాచకాలకు ప్రతిఘటనగా కోట ఉర్సు కరీమాబాదు ప్రాంతం నుండి ఆర్య సమాజం వారు వూరేగింపు  తీశారు. రైల్వే గేటు  వద్ద ఘర్షణ జరిగి ఒక అరబ్బు చనిపోయాడు. పోలీసువారు అక్కడికి వచ్చారు. అక్కడ స్టేషను నుంచి వస్తున్నా గూడ్సు బండిని నిలిపి దాని వెనుక నుంచి తుపాకులు పేల్చారు. ముగ్గురు ఆర్య సమాజ కార్యకర్తలై ప్రాణాలు కోల్పోయారు. 

దీనంతటి వల్ల వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో పెద్ద సంచలనం చెలరేగింది. న్యాయవాదులు న్యాయస్థానాలని బహిష్కరించారు. స్టేట్ కాంగ్రెస్ వారు సాయుధ ఘర్షణకు పిలుపు ఇచ్చారు. కమ్యూనిస్టులు ఆయుదాయాలు చేబూని గ్రామాలలో భూములని పంచె కార్యక్రమానికి పూనుకున్నారు. శ్రీయుతులు హయగ్రీవాచారి, కే. వి. నరసింగ రావు గారాలు విజయవాడలోనూ, చాందాలోనూ పోరాటం దళాలను నిర్వహించారు. 

పరకాలలో పోలీసు కాల్పులు  13 మంది ప్రాణాలని తీశాయి. గురుమూరులో 12 మంది మరణించారు. అక్కడ రజాకారులు ఆడవారిని వివస్త్రాలుగా చేసి వారిని వూరేగించారు. వేలాదిమంది నిజామురాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకి వెళ్లి అక్కడ తలదాచుకున్నారు.  ఇక నిజాము రాష్ట్రములో అందరూ ఘర్షణకి సిద్ధం కావటంతో అక్కడ శాంతి భద్రతలు నశించి పోయాయి. రజాకారులు రెమిడిచర్ల హ్రామాన్ని తగులబెట్టారు. భారత ప్రభుత్వం నిజాము రాజ్యం మీద ఆర్ధిక దిగ్భందం విధించింది. దానితో పెట్రోల్, కిరోసిన్ మొదలైన వస్తువుల కొరత ఏర్పడింది. 

1948 సెప్టెంబరు 17 నాడు భారత ప్రభుత్వం హైద్రాబాదు మీద పోలీసు చర్య తీసుకుంది. జైలులో ఉంటున్న శ్రీయుతులు ఎం. ఎస్. రాజలింగం, చంద్రమౌళీశ్వరరావు , కాళోజి నారాయణ రావు , ఇటికెల మధుసూదన్ , అడవాల సత్యనారాయణ మున్నగు కాంగ్రెస్ కార్యకర్తలు విడుదలయ్యారు. 

నిర్వాస ప్రదేశాల నుండి శ్రీయుతులు హయగ్రీవాచారి, ఎస్. మనోహర రావు, మాదిరాజు కోటేశ్వర రావు, పండిత రుద్రదేవ్, చెరుకు కాంతయ్య ప్రభృతులు తిరిగి వరంగల్ చేరుకున్నారు. 

జనరల్ జె. ఎస్. చౌదరి నెలకొలిపిన మిలిటరీ ప్రభుత్వం నిజాము రాష్ట్రంలో శాంతిభద్రతలు కోలుకోవటానికి దోహదం కల్పించింది. 

పోలీసు చర్య పిదప కూడా కమ్యూనిస్టులు తమ భూముల పంపకం ఉద్యమాన్ని విరమించుకొనలేదట. వారు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండిపోవడంతో మిలిటరీ గవర్నర్ పరిపాలన మార్పుచెందలేదు. కాంగ్రెస్ పార్టీలో సయితం స్వామిజీ గ్రూపు , బూర్గుల గ్రూపు మధ్య స్పర్ధలు ఉంటూ ఉండేవి. తుదకు వెల్లోడి సివిల్ గవర్నర్ ఉంటున్నప్పుడు నలుగురు కాంగ్రెసు మంత్రులను తీసుకున్నారు.  శ్రీయుతులు బూర్గుల రామకృష్ణ రావు, దిగంబర రావు బిందూ , ఎ . బి . రాజు, వినాయక రావు, విద్యాలంకార్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మంత్రివర్గం 1952 లో ఎన్నికల దాకా కొనసాగింది. దరిమిలా కాలంలో వేలాది కమ్యూనిస్టులను కారాగార గృహాలనుంచి విడుదల చేశారు. వారు తమ భూ-పోరాటాన్ని విరమించుకొని ఎన్నికలలో  పాలుగొనటంతో శాంతి భద్రతలు ఏర్పడినాయి.   ఎన్నికల తరువాత శ్రీ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వం అవతరించింది. స్వామీజి గ్రూపు వత్తిడి మూలంగా ముఖాయమంత్రి శ్రీ రామకృష్ణ రావు రాష్ట్రంలో భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. నేత, గీత ఉద్యమాలు సహకార రంగంలో చేరిపోయాయి. 

అప్పుడే శ్రీ ఆకారపు నరసింగరావు వారి దాతృత్వంతో వరంగల్ స్టేటన్ పై విశ్వేశెరాయాలం, విష్వఈశ్వర సంస్కృతాంధ్ర కళాశాల , అనంత లక్ష్మి ఆయుర్వేద కళాశాల , సుశీలాదేవి ప్రాధమిక పాఠశాల స్థాపించబడి స్థిరమైన పునాదుల మీద నిలబడగలిగాయి. 

జనాకర్షణ 

ప్రజాస్వామ్య పద్దతి మీద ఎన్నికలు రావటంతో శాసనసభ్యులు , స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం విశేషంగా జనాన్ని ఆకర్షించాయి. 

కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిన పిదప జాతీయవాదులలో స్వచ్ఛంద సేవాసక్తి తరిగిపోయి వృత్తి రాజకీయాలు, పదవుల తాపత్రయాలు పెరిగిపోయాయి. రాజకీయాల ద్వారా ధనాన్ని , సత్తాను పెంపొందించుకొనాలనే దృక్పధం సర్వత్రా వ్యాపించింది. శిక్షణ కార్యక్రమాలు, సేవారంగం త్యాగపూరిత ఉద్యమాసక్తి లోపించసాగాయి. సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం సంస్థల ద్వారా జరుగుతూ ఉండటం చేత పదవీ రాజకీయాలు తెరి వెలియడం కూడా సహజమే. 

ఇది భూస్వామ్య , ధనిక వర్గ రాజకీయ ప్రాబల్యానికి దారి తియ్యటంలోను అబ్బురమేమీ లేదు. 

పై విధంగా 1940-50 ల మధ్య జరిగిన జాతీయ స్వాతంత్రోద్యమంలో తెలంగాణాకు చెందిన జిల్లాలకు స్ఫూర్తి దాయకమైన కేంద్రంగా వరంగల్ విభిన్న రంగాలలో బహుముఖ పాత్రను నిర్వహించివుంది. 

Published in Andhra Patrika between February 6-8 1984

Retrieved from archive.org:

https://archive.org/details/ANDHRAPATRIKA06021984/page/n3/mode/2up

https://archive.org/details/ANDHRAPATRIKA07021984/page/n3/mode/2up

https://archive.org/details/ANDHRAPATRIKA08021984/page/4/mode/2up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami