KakatiyaPatrika.com Header Image

పాములపర్తి సదాశివ రావు

శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. ఆనాటికి చిన్న చిన్నగా పద్యాలు రాస్తూ కాకతీయలో ప్రచురణ కోసం ఒకసారి ఒక రచన అందించి వచ్చాను. (అయితే అది ప్రచురించబడలేదు.) ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంలో నేనూ, పి.ఎన్‌. స్వామి, ఉదయరాజు రాధాకృష్ణ ముగ్గురమూ ఒక ప్రత్యేక సంచిక వెలువరించ బూనినప్పుడు దానికి సంపాదకత్వ భారాన్ని వహించి నాటికి చాలా అందంగా విశిష్టంగా ప్రచురించారు. దానిలో ఆయన కాకతీయ శిల్పం గురించి ప్రత్యేక వ్యాసం వ్రాశారు. నేను అప్పటికి హైదరాబాదులో బి.ఎ. చదువుకుంటున్నాను. నా చేత ప్రత్యేకంగా దానిలో ప్రచురణ నిమిత్తం `స్థానిక సాహిత్య సమీక్ష’ అనే పేర వరంగల్లు జిల్లా సాహిత్య వికాసం గురించి చక్కని వ్యాసం వ్రాయించారు. దానిలో చివరకు నేను మరిచిపోయిన నాలుగైదు పేర్లను చేర్చి వ్యాసాన్ని సమగ్రం చేశారు. అప్పటి నుంచీ ఆయనతో నా పరిచయం కొనసాగింది. `తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు’, చరిత్ర, సంస్కృతి, కళ’, `జ్ఞాన సిద్ధాంతం’, `భారతీయ సాహిత్య పరిణామాలు పరిశీలన’ మొదలైన పరిశీలనాత్మకమైన రచనలే కాకుండా `అభ్యుదయ గేయాలు’ అనే కవితా సంపుటి కూడా ఆయన రచనలలో ఉన్నాయి. కాకతీయలో సంపాదకీయాలు, ఇతర రచనలు, ఇతరుల పేర్లతో వచ్చిన రచనలు అన్నీ విలువైనవే. విశ్వజ్యోతి మొదలైన పత్రికలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగాయి. వాటిల్లోనూ ఎక్కువ పాలు ఆయన చేతి రచనయే. శ్రీ సదాశివరావు పర్వతం వలె గంభీరుడే కానీ కదలకుండా ఒకే బిందువు వద్ద స్థాణువుగా నిలిచి పోలేదు. ఆయన జీవలక్షణం జిజ్ఞాస. ఒక భావనకు ఒక సిద్ధాంతానికి కట్టుబడి తన జీవితాన్నంతా ప్రశ్నించకుండా సాగిపోయిన వ్యక్తి కాదు ఆయన. ఆ పర్వతం కరిగి గంగయై ప్రవహించింది. అనేక సంస్కృతులను నాగరికతలను కాలఖండాలను స్పృశించింది. అనేక ఉపనదులను తనలోనికి సమావేశింప జేసుకున్నది. కమూ్యనిస్టు పార్టీ పక్షాన `సందేశం’ పత్రికకు సంపాదకులుగా బౌద్ధం గురించీ, శాంకరాదై్వతం గురించీ రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించారు. వీటిల్లో శాంకరాదై్వతం గురించిన పత్రిక ప్రతులను బేదాభిప్రాయాలు కారణంగా తగులబెట్టినారని వారికి మిక్కిలి సన్నిహితుడు నాకు ఆప్తమిత్రుడైన శ్రీ పి.ఎన్‌. స్వామి చెప్పారు. 1957 ప్రాంతం నుండి సదాశివరావులో మార్కి్సస్టు తత్త్వం విశ్లథమవుతూ వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఆయన ప్రచురించిన `అభ్యుదయ గేయాల’లో ఈ విశ్లథ దశ స్పష్టంగా గోచరిస్తుంది. దీనిలోని `భూమాత’ అన్న రచన జాతీయ చైతన్యానికి, ఉజ్జ్వలమైన గతానికి హారతులెత్తింది. `శాంతి ఆయుధంలో స్వాతంత్య్ర పథంలో సామ్రాజ్య రాక్షసిని సంహరించిన భూమి’ `శూరాధి శూరులౌ రాజులేలిన భూమి’ `యోధాను యోధులై పోరుసల్పిన భూమి’ `వీరాధి వీరులౌ శ్రీరామ చంద్రులను’, `కారుణిక మూర్తులౌ శాక్య గౌతములను’, `శృంగార రూపులౌ రాధా మాధవులను’, `జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను’ గన్న తల్లికి పూజ చేద్దాము’ ఇవన్నీ ఈ కవితలోని పంక్తులు. `గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళు్ళలతో, అన్నా `మంచి గతమున కొంచెమేనోయ్‌’ అన్నా ఆ కవుల దృష్టికి సదాశివరావు దృష్టికి ఎంత భేదం ఉన్నదో గుర్తించడం అవసరం. చైనా దురాక్రమణ సందర్భములో ఆయన విశ్వజ్యోతి’ ప్రత్యేక సంచికలో చైనా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ వ్రాసిన వ్యంగ్యరచన నాకింకా స్పష్టంగా గుర్తే ఉంది. అప్పుడు అభ్యుదయ కవులెవరూ నోరు విప్పలేదు. శాక్యముని అన్న రచనలో `2500 ఏండ్లు గడిచిపోవనిప్పుడు తిరుగవచ్చినావ సర్వానికి మిన్నయైన జనయిత్రిని భారత మాతను చూడగ’ భారతమాతను సర్వానికి మిన్నయైన జనయిత్రిగా ప్రస్తుతించారు. అందువల్లనే ఆయన `మానుషత్వము బోధింపు కానీ భావమానుషత్వమును కాదు. సత్యధర్మముల కీర్తింపును కానీ ఊహా సిద్ధాంతములుగ మాత్రం కాదు.’ అని ఆచరణ ప్రాథమ్యాన్ని తెలుపుతూ సిద్ధాంత మౌఢ్యాన్ని తిరస్కరించారు. తరువాత తరువాత ఆయన అధ్యయన పరిధులు విస్తరించాయి. విశ్వ వ్యాప్తంగా వచ్చిన సామాజిక, ఆర్థిక, తాత్తి్వక, రాజకీయ సిద్ధాంతాలు, సాహిత్య, సంగీత, చిత్ర, శిల్పాదులు, విజ్ఞాన శాస్త్రాంశాలు, ఒకటేమిటి ఏదైనా ఆయన అధ్యయనంలో భాగమే అయింది. భరతుని సంగీత సిద్ధాంతం, విద్యారణ్యుల వేదశాస్త్ర పరిశోధన గ్రంథాలు, సూఫీవాదం భారతీయ చరిత్ర పునర్విలోకనం, భాగవత సంప్రదాయం ఇలా ఎనై్ననా ఆయన విచారణ పరిమితిలో నూతన కాంతులను సంతరించుకున్నాయి. వరంగల్‌ నగరంలో ఎనభైలలో మొదట పోతన పంచశతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో జరగటానికి, చివర్లో విద్యారణ్యులను గురించిన సంగోష్ఠూలు నిర్వహింప బడటానికి ఆయనే మూలకారణం అనడం సత్యోక్తి. ఈ రెండు సందర్భాలలోనూ ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ కారణంగా ఆయనతో కొన్ని నెలలపాటు, ఏండ్లపాటు అధ్యయనంలో, చర్చలలో, కార్యనిర్వహణలో పాల్గొనగల్గటం నా అదృష్టమనే చెప్పాలి. చివరి రోజులల్లో డాక్టర్‌ రాజారాం గారి తోటలో సుమారు రెండు వందల ఉపన్యాసాలు భారతీయ చరిత్రను గురించి ప్రపంచ తాత్తి్వకుల గురించీ ్టవులను గురించీ చేసిన ప్రసంగాలు అమూల్యమైనవి. వాటిని సంపాదించి ఎడిట్‌ చేసి ప్రచురించగలిగితే ఒక నూతన భాండాగారం వివృత కవాటం అవుతుంది. శ్రీ అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి దాకా ఆయన స్పృశించని అంశం ఉండేది కాదు.

(Courtesy: Sri Kovela Suprasanna Charya gari blog at http://samparayam.blogspot.com/2009/02/blog-post_16.html )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami