(Posted in Face book on 28th June 2014
by Pamulaparthi Niranjan Rao)
***
అప్పుడెప్పుడో పదకొండో తరగతిలో
ఇంగ్లీష్ పాఠంగా చదువుకున్నా –
‘మాట్లాడడమే రజితమైతే, మౌనంగా ఉండడం బంగారమే!’ అని-
దానర్థం తెలిసినా పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు –
ఏ విషయంపైనా సరిగ్గా మాట్లాడలేని ప్రతివాడూ
దీన్ని సాకుగా చూపించి మౌనంగా వుండి
మేధావిలాగా మొహం పెడితే మరి?
ఇదీ నా సందేహం!
***
ఐతే కొద్ది రోజుల్లోనే సమాధానం దొరికింది
యీ గొప్ప తత్త్వం గురించి,
దీని నిజమైన అర్థం గురించి –
ఇది మాట్లాడడం చేతగాని, విషయ పరిజ్ఞానం లేని ‘మౌనం’ గురించి కాదని!
నిజ విషయార్థం ప్రత్యక్షమైంది
ఒక అపురూప మహోన్నత రూపంలో
జ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ-
***
ఏ విషయమైనా పరిపూర్ణ అవగాహనతో-
సమగ్ర సమాచారంతో ఎన్ని గంటలైనా
అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్లుగా
మామూలు మనిషి కూడా తలవూపేటట్లుగా
వివరించగల ఆ సర్వతోముఖ ప్రజ్ఞాశాలి!
మేధస్సులో ఒక బృహస్పతి,
వాక్కులో ఒక వశిస్టుడు, ఒక వ్యాసుడు
రచనలో యిక వాల్మీకే!
ఆ మధుర వాక్కుల ‘వెండి’ వెలుగుల కంటే,
గంభీర మౌన ముద్రతో చెవులకు గాక
నేరుగా హృదయానికి అత్తుకునే ‘స్వర్ణ’ భావాలను
వెల్లడించగలిగే ఆ అపర బ్రహ్మ
నిరంతర ఆలోచనా తరంగాలను
సంపూర్ణంగా అర్ఠం చేసుకునే
మేధస్సు ఎవరికుంటుంది
ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన వారికే తప్ప?
***
నేడు జ్ఞాన కాంతి ప్రసరణ నలుదిశలా
వ్యాపిప జేసే ఆ మధుర వాక్కులు లేవు;
నిరంతర ఆలోచనా స్రవంతులతో నిండిన
ఆ గంభీర మేధస్సు లేదు;
ఆప్తుల నాప్యాయంగా ఆదరించే ఆ చిరునవ్వుల
ముఖారవిందం లేదు…
ఐతే ఈ శూన్యాన్ని ఛేధిస్తూ ఇప్పటికీ
ఆత్మీయుల హృదయాంతరంగాలలో
ఎల్లప్పుడూ వీణా తంత్రులను మీటే,
ఆ మహనీయుడికి ఎన్ని నివాళులర్పించినా
ఆ మధుర జ్ఞాపకాలను ఎట్లా మరిచిపోగలం?