KakatiyaPatrika.com Header Image

పీ వీ గారంటేనే ఒక కౌస్తుభం! ఎన్ని రత్నాలైతే ఆయనకు సమం? పాఠశాల విద్యార్థి దశ నుండే ప్రకాశించిన సకల రంగ జ్ఞాన విన్యాసం

((పీ వీ నరసింహా రావు గారి శత జయంత్యుత్సవ సందర్భంగా పాములపర్తి నిరంజన్ రావు ఫేస్ బుక్ లో 28-6-2021 నాడు పోస్ట్ చేసిన సుదీర్ఘ వ్యాసం.)

***

1921 లో నిజాం ప్రభుత్వ హైదరాబాద్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో పుట్టి, ప్రక్కనే వున్న కరీంనగర్ జిల్లాలోని మరో చిన్న గ్రామంలో పదేండ్ల వరకు పెరిగి తన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆ బాలుడు 1931 లో మాధ్యమిక విద్యకై మళ్ళీ వరంగల్ పట్టణానికి వచ్చాడు. ఆ బాలుడు ఈ పదేండ్ల వ్యవధిలో గ్రామ వాతావరణానికి, అక్కడి అమాయకత్వానికి అలవాటు పడ్డాడు. ఇక పోతే వారుండేది అలనాటి రాచరికపు నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన క్రింది హైదరాబాద్ రాష్ట్రంలో!  పరిపాలనా, విద్యా బోధనా అంతా ఉర్దూ మీడియమే. ఆ బాలుడు చదవవలసిన ఆ పాఠశాల పేరు ‘కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’. అందులో లో ఇంటర్మీడియేట్ వరకు చదవవచ్చు. తర్వాత డిగ్రీ కోర్సు చేయాలంటే హైదరాబాద్ నగరానికి పోవల్సిందే! ఆ బాలుడు ప్రాథమిక విద్యలో మెరుగైన విద్యార్థి అనిపించుకున్నాడు, కాబట్టి బహుషా ఆ బాలుడి తలిదండ్రులు ఇతను బాగా చదువుకొని ఒక లాయర్ గానో లేక తహసిల్దార్ గానో కావాలని కోరుకొని వుండవచ్చు. ఎందుకంటే ఆనాటి పల్లె ప్రజలు భయమూ, గౌరవమూ సమపాళ్ళల్లో కలిపి చూసే ఉద్యోగాలివి! అంతే కాకుండా ఆనాటి సమాజంలో, ముఖ్యంగా వారున్న గ్రామ సామాజిక వాతావరణంలో గౌరవ ప్రదమైన వృత్తులివి.   మరి ఆ బాలుడి మనస్సులో ఏముందో? ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన  బడి పంతులా?

          ఐతే, కాల మహిమ విచిత్రమైంది.  ఆ బాలుడి భవిష్యత్ జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని క్రొంగొత్త భవిష్యత్తు రూపు దిద్దుకుంది.  బహుషా ఎవరూ – అప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా –   అంచనా వేయని రీతిలో ఆ బాలుడు ఎంతో ఎదుగెక్కి ఊహించని ఉన్నత శిఖరాలు చేరుకున్నాడు.

ఒక్కసారి 1930 నాటి దేశ పరిస్థితులు గమనిద్దాం. 

అప్పటి బ్రిటిష్ పాలనలో వున్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలు.  అప్పటికే విదేశీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమం దేశమంతా సాగుతున్నా, నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో ఆ ఉద్యమ ఛాయలు మృగ్యం. ఒక వేళ వున్నా అవి ఆర్య సమాజ్ నినాదంతో మొగ్గ తొడుగుతూ ఇంకా బలహీనంగా వున్నట్టే లెక్క. 

అప్పుడు ఎవరు అనుకున్నారు రాబోయే పది ఇరవై సంవత్సరాలలో బ్రిటిష్ పాలన నుండి విముక్తమై స్వతంత్ర భారత దేశావతరణ జరుగుతుందని…! అనుకున్నారు పో, ఆ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం  విలీనమై అంతర్భాగమవుతుందని…! అనుకున్నారు పో,  విలీనమైన  తదుపరి కొద్ది కాలానికే  ఏక భాష రాష్ట్రంగా  కొత్త రూపు దిద్దుకుంటుందని…! అనుకున్నారు పో, ఈ పదేండ్ల బాలుడు ఆ రాష్ట్ర ఏలికగా ఎదుగుతాడని…! అనుకున్నారు పో, అంతటితో ఆగక ఈ బాలుడు మరింత ఎదిగి భారత దేశాధినేతగా ఉన్నత శిఖరాలందుకుంటాడని! మొత్తానికి జరిగింది ఈ క్రమానుసరణ సంఘటనలు ఆ బాలుని విషయం లో…

ఇన్నిసార్లు ఖచ్చితంగా అనుకోవడం మామూలు మానవులకే కాదు, మహిమాన్విత  మహనీయులకు గూడా సాధ్యం కాని పని. అందుకే దీనిని ‘కాల మహిమ’ అన్నాను.

ఇప్పటికే మీకు తెలిసిపోయుంటుంది ఆరవ తరగతి లో చేరడానికై వరంగల్ పట్టణంలోని హనుమకొండ ప్రాంతంలో గల ‘కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు చేరుకున్న ఆ పది పదకొండేండ్ల నాటి బాలుడే, ఆరోగ్యం సహకరించని 70 ఏండ్ల వయస్సులో అనుకోని ఆకస్మిక పరిణామాలతో ప్రధాని పదవి అధిష్టించి  దేశ భవిష్యత్తుకై క్రొంగొత్త రూప కల్పనలను గావించి అవిశ్రాంతంగా శ్రమపడ్డ మొన్నటి  మన తెలుగు బిడ్డ – మన తెలంగాణా  స్ఫూర్తి – శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారని. ఇంకా ఆప్యాయంగా చెప్పుకోవాలంటే మన పీవీ గారని!

ఇంకా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆ అమాయకపు బాల్య దశలో ఆ పాఠశాల భవన ప్రాంగణంలో అడుగిడిన ఆ విద్యార్థిని ఉత్తేజపరచి ఒక ఉత్తమ ఆలోచనా పరుడిగా చేసి అతని భవిషత్తు తీరు తెన్నులకు దిశా నిర్దేశం జరిగింది అప్పటినుండే… ఆ క్షణం నుండే.

ఒక్కసారి ఆ గతంలోకి పోదామా? 

గతంలోకి పోయే ముందు  కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా పీవీ గారు అలనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయింపబడ్డ సమయం చూద్దాం. 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులవి. సామరస్య పరిస్కారానికి కృషి  సల్పకుండా , ఉద్యమాన్ని తుడిచిపెడదామని అన్ని తీరులా (కర్ఫ్యూలు, కాల్పులు, అరెస్టులు మొదలగు అన్ని రకముల అణచివేత కార్య క్రమాలను సాగించి) విఫలము చెందిన అలనాటి రాష్ట్ర , కేంద ప్రభుత్వాలు తుదిప్రయత్నంగా అప్పటి ముఖ్య మంత్రి స్థానంలో తెలంగాణాకు చెందిన వ్యక్తిని నియమించాలని భావించి ‘ఆమోద వ్యక్తి ఎవరా?’ అని శోధించే క్రమంలో  ఉద్యమ   నాయకుడైన చెన్నా రెడ్డి గారూ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బ్రహ్మానంద రెడ్డి గారితో సహా అటు  కాంగ్రెస్ ఆంధ్రా శాసన సభ్యులకు,  ఇటు తెలంగాణా శాసన సభ్యులకు ఆమోదయోగ్యుడిగా కనుగొన్నబడ్డ వాడు మన పీవీ గారు. 

ఇకపోతే 1991వ సంవత్సరానికి చేరుదాం. వివిధ కారణాల వల్ల రాజకీయాల నుండి సంపూర్ణ విరమణ తీసుకుందామని పీవీ గారు భావించారు.  దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రచార సమయంలో ఆకస్మిక దాడికి గురై దుర్మరణం చెందటంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా నాయకుడిని కోల్ఫోయింది. ఆ సందర్భంలో తగు నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ లిస్టులో పీవీ గారి పేరే మొదటిగా వుంది.  ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, తదుపరి అదే క్రమంలో ప్రధాన మంత్రిగా నియమింపబడ్డారు మన పీవీ.  రాజకీయాల నుండి రిటైరై ఢిల్లీని వదిలివేయాలనుకున్న పీవీ గారిని ‘ఎక్కడికీ పోవద్దు – ఇక్కడే వుండ’ మని   యేకంగా ఢిల్లీ గద్దెనే ఆహ్వానించింది. 

ఈ రెండు సందర్భాలు – మామూలు సందర్భాలు కావు, విపరీత పరిస్థితులు – పీవీ గారి వైపే దిశా మార్గం చూపించాయి.  ఎందుకని?

ముందుగా 1971 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే ప్రత్యేక రాష్ట్ర   ఉద్యమ తీవ్రత పెరిగి ఇంకేం అవుతుందో అన్న అగమ్య గోచరం.  చాలా మంది తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు వారి వారి గ్రామాలకు పోతే అక్కడ ఇల్లు వదిలి బయటకు వచ్చే స్థితి లేదు. అందరూ హైదరాబాదుకే, ఎం ఎల్ ఏ క్వార్టర్స్ కే పరిమితమయ్యారు.  కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇది ప్రజా మనోభావాల నెరిగి తదనుగుణంగా తయారు చేసిన కుంపటి కాబట్టి ప్రజల నాకర్షించడంలో అది ముందుంది.  ఇక అటు ఆంధ్రాకు చెందిన మంత్రులైనా, శాసన సభ్యులైనా ఈ ఉద్యమానికి త్వరలో చరమగీతం పాడాలని తహతహలాడు తున్నారు, ఈ పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రిని మార్చి  తెలంగాణా వారికి ఆ పదవి ఇచ్చేట్లుగా నిర్ణయించడమైంది.

ఇక పీవీ గారు –  1962 లో మొదటి సారిగా శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో న్యాయ సమాచార మంత్రిగా చేరారు.  తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగార్ల  ముఖ్యమంత్రుల సారధ్యంలో కూడా  పనిచేసి 9 సంవత్సరాలు వివిధ ముఖ్య శాఖల్లో మంత్రివర్యులుగా, ప్రభుత్వంలో ఒక ముఖ్య నాలికగా మెలిగారు.  అప్పటి శాసన సభలల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు, ఆయన చేసిన ప్రసంగాలు ఆయన సునిశిత మేధా సంపత్తికి అద్దం పడతాయి. అప్పటి ప్రతి ముఖ్య మంత్రికి ఆయన దగ్గరి వాడే! ప్రతి మంత్రికి ఆయన అవసర సమయాల్లో సలహాదారే!! ఇక అప్పటి మేటి ప్రతిపక్ష ప్రశ్నా నాయకులైన శ్రీ తెన్నేటి విశ్వనాధం, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మొదలగు వారి ఉద్ధండ విమర్శనా వాగ్ఢాటి ప్రసంగాలకు ఆయన ప్రభుత్వం తరఫున ఇచ్చిన సమాధానాలు ఆ విమర్శించిన వారే చివరకు ఔనన్నట్లుగా తలలూప జేసిన సమ్మోహన అస్త్రాలే!!! ఇందుకు ఉదాహరణగా 1965-66 లో అధికార భాషగా తెలుగును ఏర్పరచడానికి సంబంధించిన శాసన సభా ప్రసంగాలు ‘భువన విజయ’ అష్ట దిగ్గజాల కావ్య పఠన మాధుర్యాలను గుర్తుకు తెచ్చేవని అనుకునేవారు, ఇక ఆ శాసనసభా నిలయ ప్రసంగకర్తల సాహిత్య సముదాయంలో పీవీగారు అల్లసాని పెద్దనగారే! ఆయన సునిశిత మేధస్సు, స్పష్టమైన భావ వ్యక్తీకరణం, విలక్షణ ఆలోచనా ధోరణి మొదలగు సుగుణాలు ఆయనను అందరికీ దగ్గర చేసాయి. ఈ విధంగా అందరి మనస్సును చూరగొన్న పీవీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరి ఆమోదం పొందారంటే ఆశ్చర్యమేముంది?

ఆవిధంగా పీవీ గారు ముఖ్యమంత్రయ్యారు. తర్వాత క్రమంలో ముఖ్యమంత్రిగా  పీవీకి అలనాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో పరిచయాలు ఏర్పడ్డాయి. పీవీ నిరాడంబరత, మేధా సంపత్తి, సాహిత్య అభిలాష ఆమెకు అవగతమవుతున్న తరుణంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఆయన్ను ముఖ్యమంత్రి పదవికి,  హైదరాబాదుకు దూరాన్ని చేసింది. పార్టీకి కావలసిన వాడిగా ఆయనను ఇందిరా గాంధీ ఢిల్లీకి దగ్గర చేసింది.  

ఆయనను మొదటగా 1977 లో పార్లమెంట్ కు పంపింది వరంగల్ జిల్లాలోని హనుమకొండ పార్లమెంటరీ నియోజక వర్గ ప్రజలే! అంటే ఆయనను ఢిల్లీలో నిలిపింది వరంగల్ జిల్లా ప్రజలే! ఆయన గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఆయన కేంద్ర మంత్రి కాలేక పోయినా తిరిగి మూడేండ్లలో 1980 లో జరిగిన ఎన్నికల్లో ఆయనతో బాటు పార్టీ కూడా గెలవడం వల్ల ఆయన మొదటిసారిగా విదేశాంగ మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి తొలుత ఇందిరా గాంధీకి, ఆ తర్వాత రాజీవ్ గాంధీకి దగ్గరై  తగు సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారన్నది నిర్వివిధాంశం.

 తర్వాత ఆయనను ప్రధానమంత్రి పదవి ఎట్లా వరించిందో అందరికీ తెలుసు!  కొద్దిపాటి అవరోధాలున్నా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయన వైపే మొగ్గు చూపడానికి కారణం పైన పేర్కొన్న సుగుణాలే కాకుండా ఎన్ని ఒడిదుడుకుళ్ళోనూ పార్టీని, పార్టీ అధిష్ఠానాన్నీ అంటిపెట్టుకొని వుండటం కూడా ఆయన విశ్వసనీయతగా గుర్తెరిగారు అప్పటి పార్టీ నాయకులు. 

ఈ విధంగా ఆ గ్రామీణ అమాయకపు బాలుడు బెదురుతూ ఆ పాఠశాల ప్రాంగణం లోనికి అడుగుబెట్టిన నాటినుండి ఏ విధంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడం జరిగింది,   అతని చైతన్య ప్రవృత్తి ఎట్లా మారుతూ వచ్చింది  తెలుసుకోవడం  మనల్ని ఎన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందేమో?

వరంగల్ లో చదువుల నాటి బాల్యం:

పాఠశాలలో 6వ తరగతిలో చేరిన రెండు రోజుల తర్వాత పీవీ మధ్యాహ్న భోజనం ముగించి స్కూల్ ఆవరణలో వున్న వాటర్ టాంక్ నల్లా వద్ద నీళ్ళు తాగుతున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అదే వయస్సు గల మరొక పిల్లవాడు తనూ నీళ్ళు తాగుతూ యధాలాపంగా ‘నీ పేరేంటోయ్?’ అని అడిగాడు. ఆ రోజుల్లో ఇంటి పేరుతో సహా పూర్తి పేరు చెప్పే పద్ధతి వుంది కాబట్టి ఆ మొదటి బాలుడు “నా పేరు పాములపర్తి వెంకట నరసింహారావు” అని చెప్పాడు.  “అరే, నా పేరు   పాములపర్తి సదాశివరావు” అని తెలిపాడు రెండో బాలుడు ఎంతో సంతోషంతో. ఆ సాయంత్రమే తన మిత్రున్ని వరంగల్ లోని మట్టెవాడలో గల తన ఇంటికి తీసుకుపోయి ఇంట్లోని పెద్దలకు పరిచయం చేయడం, వారి ద్వారా ఇద్దరి మధ్య గల ‘దూరపు బంధుత్వం’ తెలిసికోవడం జరిగింది. ఆ విధంగా ఆ మంచినీటి నల్లా వారి మధ్య ఒక గొప్ప మైత్రికి నాంది పలికింది. క్రమేణా ఇద్దరి మధ్య స్నేహితం బలపడటం, ఆదివారాల్లో ఇద్దరూ భద్రకాళి గుట్టలూ, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడీ మొదలగు స్థలాలకు తిరగడం చేసేవారు. పాకాల చెరువు, మెట్టుగుట్ట, గోవిందరాజుల గుట్టా, ఇంకా ఎన్నో వారి తిరుగుళ్ళకు అనువైన ప్రదేశాలే!  

ఇక స్కూల్లో పీవీ చదువులో  ప్రధముడు, ఉపాధ్యాయులకు ప్రియతమ స్టూడెంట్, తోటి విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు. పరీక్షలో అతడు రాసిన ఆన్సర్ పేపర్లను టీచర్లు ఇతర విద్యార్థులకు చదివి వినిపించి మెచ్చుకునేవారు.  పాఠ్యగ్రంధాలలో ఆయా పాఠాలు రాసిన రచయితల శైలిని త్వరగా పట్టేసేవాడు పీవీ. ఆ శైలికి తన స్వంత శైలిని అద్బుతంగా మిళితం జేసి సమాధానాలు రాసేవాడట!

అప్పుడప్పుడూ కవిత్వాలు, కథలు, నాటకాలు రాయడం, తోటి విద్యార్థులకు అవి వినిపించడం, నాటక ప్రదర్శనల్లో స్త్రీ పాత్రలు మరియు మగ వేషాలు వేయడం, రాగయుక్తంగా సినీ పాటలు పాడి వినిపించడం మొదలగు ఉత్సుకత కలిగించే పనులవల్ల తోటి విద్యార్థులకు  పీవీ ఒక ‘సవ్య సాచి ‘ లాగా కనిపించేవాడు. మొత్తానికి పీవీ అటు ఉపాధ్యాయులకు, ఇటు తోటి విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రు డయ్యాడు..

ఒకసారి స్కూల్ లో ‘కృష్ణకుమారి ‘ అనే నాటకం వేశారు. పీవీ ది అందులో కృష్ణకుమారి పాత్ర. పీవీ తన పాత్ర డైలాగులతో బాటు ఆ నాటకంలోని అన్ని పాత్రల డైలాగులను కంఠతా పట్టేశాడు. రిహార్సులకు ఏ పాత్రధారి రాకున్నా ఆ పాత్ర డైలాగులు చెప్పేవాడు. కృష్ణకుమారి నాటకం లో పీవీ అభినయం చూసి ప్రశంసించని వాళ్ళు లేరు.

ఇక స్కూల్ బయట పీవీకి ఆసక్తి లేని విషయం లేదు. మొదటగా అప్పటి సైలెంట్ సినిమాలలో మాస్టర్ విఠల్ అంటే అభిమానించాడు. తర్వాత టాకీలు వచ్చాక పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, సొహరాబ్ మోడీ లతో పాటు అలనాటి  మేటి నటీమణులు దేవికారాణి.  దుర్గా ఖోటే, కనన్ బాల మొదలగు వారి సినిమాలు తప్పక చూసేవాడు. తెలుగులో కాంచన మాల, కన్నాంబల నటనా ప్రతిభను మెచ్చుకునే వాడు.

రాగయుక్తంగా పద్యాలు గొంతెత్తి బిగ్గరగా పాడటమంటే పీవీ కి బాగా ఇష్టం.   వరంగల్ లో   పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందంటే తప్పక హాజరు. స్ఠానం నరసింహారావు ‘సారంగ ధర’, డీ వీ సుబ్బారావు ‘హరిశ్చంద్ర’,  తెనాలి డ్రామా కంపెనీ వారి ‘కృష్ణ లీలలు’ మొదలగునవి చూడటమే కాకుండా  ఆ ప్రదర్శన లోని  పద్యాలు రాగయుక్తంగా  పాడి మిత్రులకు వినిపించే వాడు.

ఇక సర్కస్ వచ్చిందంటే ఎంతో ఆనందం. స్కూల్ వదిలిన తర్వాత సాయంత్రం నేరుగా సర్కస్ డేరా బయటకు చేరేవాడు. చీకటి పడేదాకా అక్కడే గడిపే వాడు. డేరా వెలుపల గొలుసులతో కట్టేసిన ఏనుగును చూస్తూ అమిత ఆనందం పొందేవాడు.

వీటితో పాటు చిలిపి చేష్టలు కూడా! సినీ తారల బొమ్మలను కత్తిరించుకొని ఫైల్ చేయడం; రాత్రిళ్ళు గానా పార్టీలల్లో గడపడం; మిత్రులతో హనుమకొండ చౌరాస్తా, లష్కర్ బజారులలో రోడ్లపై తిరగడం; ‘అప్పూ హోటల్ ‘ వద్ద అర్థణాకు ఆలూ బజ్జీ, మూడు పైసలకు టీ, ప్రక్కనే వున్న పాన్ షాప్ లో పైసా కు ‘పాన్ బీడా’ సేవానంతరం ఇరుగు పొరుగు ఇండ్ల ముంగిళ్ళ గాలింపు యిత్యాది కార్యక్రమాలు కూడా వుండేవి. ఆ రోజుల్లో వరంగల్ పట్టణంలో భామా కలాపం, గొల్ల కలాపం, ఉషాపరిణయం మొదలగు కూచిపూడి భాగవత ప్రదర్శనలు జరిగేవి. దీపావళి పండగ రోజుల్లో హారతులు, బోగం మేళాలు, గాన సభలు జరిగేవి. ఇంకా పెండిండ్లు పేరంటాల సందర్భాలలో పాట కచేరీలు జరిగేవి. ఇలాంటి కార్యక్రమాలంటే పీ వీ కి బహు సరదా.

ఆనాటి నిజాం ప్రభుత్వ పాలనలో పౌర హక్కులకు గుర్తింపు లేని స్థితి. కాబట్టి వరంగల్ యువకులు, విద్యార్థులు  గణేశ్ ఉత్సవాల పేరుమీద జన సమీకరణ గావించి హిందూ సంఘటనా శక్తి గా  కార్యక్రమాలు నిర్వహించే వారు. అదే విధంగా హనుమకొండ విద్యార్థులు, యువకులు ‘భజన మండలి ‘ పేరుతో ఒక సంస్థ నేర్పరుచుకున్నారు. ఈ రెండింట్లో కూడా పీవీ చురుకుగా పాల్గొనే వాడు.

పీవీ 7 వ తరగతిలో వున్నప్పుడు స్కూల్ తరఫున  విద్యార్థులను ఉత్తర దేశ యాత్రకు తీసుకుపోయారు. పీవీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నాడు. ఆ యాత్రలో పీవీ కేవలం వివిధ ప్రాంతాలు, ప్రజలు,  అక్కడి విశేష భవనాలు, కట్టడాలు  చూడటంతో సరిపెట్టుకోకుండా ఆ ప్రాంత ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లూ, ఆహార అలవాట్లూ విపులంగా పరిశీలించేవాడు. యాత్ర నుండి రాగానే తన యాత్రానుభవాలను తన సహచరులకు చెప్పేవాడు. ఈ యాత్రానుభవ వర్ణనాత్మక వివరణ కొన్ని నెలలల పాటు జరిగిందట. అంటే పీవీ లో ఈ యాత్ర ఎంతో ఉత్సుకత కలిగించిందనీ, ఆ యాత్ర లో పీవీ ఎంతో తాదాత్మ్యత చెందాడని తెలుస్తుంది.

వయస్సు పెరిగి నూనూగు మీసాలు వచ్చేసరికి పీవీ, సదాశివుడు ఎప్పుడైనా సినిమాలను చూడటానికి చెరో 5 రూపాయలు తీసుకొని హైదరాబాద్ పోవడానికి పాసెంజర్ బండి ఎక్కి నాంపల్లి స్టేషనుకు చేరి స్టేషనుకు ఎదురుగానే వున్న రాయల్ హోటల్ లో, లేదా నాంపల్లి షరాయిలో రెండు రోజులు మకాం వేసేవారు. పాన్ బీడా వేసుకొని ‘టివోలీ’, ‘లైట్ హౌస్’ థియేటర్లలో సినిమాలను చూడడం; పబ్లిక్ గార్డెన్, టాంక్ బండ్, కోఠీలలో తిరగడం చేసే వారు. మళ్ళీ పాసెంజర్ ట్రైన్ ఎక్కి వరంగల్ చేరే సరికి 5 రూపాయల్లో ఇంకా ‘చారాణా’ మిగిలేదట! 1939 లో విడుదలైన శాంతారాం గారి మూవీ ‘ఆద్మీ’ చూసి వచ్చిన తర్వాత మిత్రులిద్దరూ ఆ సినిమాను గురించి వారం పాటు చర్చించుకున్నారట!!

ఈ చిన్ననాటి తిరుగుళ్ళే పీవీ కి టూరిజం మీద ఆసక్తి కలిగించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన 9 ఏండ్లలో పీవీ గారివే అధికంగా టూర్ కార్యక్రమాలుండేవట! అందరూ ఆయన్ను టూర్ మినిస్టర్ అనేవారట!! పీవీ చిన్ననాటి ఈ తిరుగుళ్ళు, ఇంకా తర్వాత మనం తెలుసుకోబోయే పీవీ చేసిన యితర వ్యాపకాలు ఉబుసులాటకు చేసినా, తప్పనిసరై చేసినా మనం గ్రహించవలసింది యేమిటంటే ప్రతిదీ ఆయన పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక దృష్టికి గురి అయ్యేది. ఆ సమాచారం ఆయన చిన్ననాటి మినీ కంప్యూటర్ మెదడులో రికార్డ్ అయ్యేది. 

సినిమాలు, పౌరాణిక నాటకాలు చూస్తున్న క్రమంలో మిత్రులిద్దరిలో సంగీతం పట్ల మక్కువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పీవీ గారు “ఏక సంథాగ్రహి” లాగా తాము చూసిన సినిమాల్లోని పాటలను సినిమా చూసి రాగానే వెంటనే ఎంతో రాగయుక్తంగా పాడేవారని సదాశివరావుగారు చెప్పేవారు.  ఒక హర్మనీ పెట్టె, తబలా కొనుక్కొని ఇద్దరూ సంగీత సాధన చేసేవారు. బాల్యంలో సంగీతంపై పెరిగిన ఈ ఆసక్తి వీరిని క్లాసికల్ సంగీతం (ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం)పై గొప్ప పట్టు సంపాదించి వివిధ సంగీత రాగ, తాళాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక  కళాకారుడిచ్చిన సంగీత ప్రదర్శన బాగోగులపై చర్చించుకునే స్థాయికి పెరిగింది.

పీవీ త్యాగరాజ కృతులు, జావళీలు విపరీతంగా అభిమానించే వాడు, వాటి లోని రాగ తాళ విన్యాసాలను అనుకరించడానికి ప్రయత్నించే వాడు. బిడారం కిట్టప్ప, నారాయణ్ రావు వ్యాస్, పండిట్ ఓంకార్ నాథ్. ఉస్తాద్  అబ్దుల్ కరీంఖాన్ మొదలగు శాస్త్రీయ సంగీత గాయకుల గ్రామఫోన్ రికార్డుల పాటలను మరీ మరీ విని ఆనందించే వాడు. అంతే కాదు, వారిని అనుకరిస్తూ చాటు మాటుగా కసరత్ చేశేవాడు. ఐతే శాస్త్రీయ సంగీతం కేవలం వినడం వల్ల రాదనీ దానికి ఎంతో సాధన చేయాల్సి వుంటుందనీ  తెలుసుకున్నాడు. ఐనా అనేక రాగాలను, తాళ విన్యాసాలను, గతి భేదాలను గుర్తించడం  అలవరచుకున్నాడు. వయసు పెరుగుతూంటే శాస్త్రీయ సంగీతం పై మక్కువ పెరుగుతూ వచ్చింది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలీన్, పన్నాలాల్ ఘోష్ వేణువు, హీరా బాయి, రోష్ నారా బేగం, కేసర్ బాయి. రవూఫ్ ల గాత్రం, ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరక్వా ‘తబ్ లా’ అంటే పీవీ కి మోజు.

ఇక ఇన్ని రకాల వ్యాసంగాలు పీవీ కి ఉంటే ఆయన కలం ఊరుకుంటుందా? నేను కూడా వున్నానని తన విన్యాసాల్ని చూపెట్టింది. స్కూల్ రోజుల్లో భావోద్వేగం ఉప్పొంగి  పీవీ  రాసిన కవితలు రక రకాలు.  ఆయన ద్విపదలు, గీతాలు, వృత్తాలు రాసాడు. అంటే ఆయనది ఒకే మూసలో వెలిబుచ్చే కవిత్వం కాదు. ఆ చిన్నతనపు రచనలు  చక్కటి భావనా శక్తి, కల్పనా వైవిధ్యం, కళాత్మక  దృష్టి కలిగి వుండేవట.  కవిత్వాలల్లడం, కథలు, నాటకాలు వ్రాయడంతో మొదలైంది ఆయన రచనా ప్రక్రియ. జయచంద్రునిపై “జయ చంద్రా- హైందవ ధ్వంసకా” ఆనే మకుటంతో ఆయన రాసిన పద్యాలు ఆ రోజుల్లో భజన మండలి సభలల్లో విరివిగా ప్రచారం పొందాయట. 

పీవీ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా పద్య – గద్య రచనలు చేశాడట. ఈ రచనా వ్యాసంగం పీవీకి ఒక అలవాటుగా తయారై రాబోయే కాలేజీ రోజుల్లో, ఆ తర్వాత వివిధ రకాల జీవన విధానాల్లో (లాయరు గా, పత్రికా నిర్వాహకుడిగా, ఎం ఎల్ ఏగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎంపీ గా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా) ‘నిత్య పఠనం – అనునిత్య రచనం’ అనే విధంగా చదవడం, రాయడం ఆయనలో అంతర్లీనమయ్యాయి. 

ఒకానొక బాల వాఙ్మయ పోటీకి పీవీ రెండు షేక్స్ పియర్ సుఖాంతక, రెండు విషాదాంతక కథా సంగ్రహాలను పంపించినట్టు, అయితే ఆ పోటీ ఫలితం వెలువడనే లేదనీ; అదేవిధంగా ఒకటో, రెండో హిందీ సినిమా కథలు వ్రాసి పంపించాడనీ వాటి అతీ గతీ కనిపించలేదని తెలిసింది. ఈ ఆశాభంగాలను పీవీ సీరియస్ గా తీసుకోలేదనీ, అతని ఉద్దేశం రాయడమనీ, ఆ పై ఏమి జరిగిందో అన్న తాపత్రయం వుండేది కాదనీ కూడా తెలిసింది.

మొత్తానికి ఆ బాల్యదశ లోనే పీవీ  కళారంగపు అన్ని పార్శ్వాలని తట్టాడు. అలనాటి నరసింహుడి భక్తుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే ‘చదువుల లోని మర్మమెల్ల చదివితి తండ్రీ!” అన్నాడట. కాని ఇక్కడ యీ నరసింహుడు స్కూల్ చదువులప్పుడే “బాల్య జీవన కళా మధురిమలన్నీ చవి జూచితి చదువరీ!“ అని మనకు తెలుపుతున్నాడు.

మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి కూడా)

 1939 వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ లో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనం (ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్ఠుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది. ఐతే ఈ నూతన ఆర్ట్స్ కాలేజీ భవనం ఆరంభం కాకముందే ఆ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు గన్ ఫౌండ్రీ లోని  తాత్కాలిక భవనంలో తమ తరగతులు నిర్వహిస్తున్నప్పుడే 1938-39లో ఒక ఉద్యమాన్ని నిర్వహించారు. అంటే ఆ నూతన భవన పుట్టుకే (అంటే ఆరంభమే) ఉద్యమాల పుట్టుక అయిందేమో? ఇది రెండవ విశేషం. ఈ ఉద్యమమే “వందే మాతరం ఉద్యమం” గా పేర్గాంచింది. తరగతులు జరుగుతున్న అప్పటి తాత్కాలిక    ఉస్మానియా యూనివర్సిటీ కేంపస్ లో   కొంత మంది విద్యార్థులు కాలేజీ ప్రార్థన సమయంలో “వందే మాతరం”   దేశ భక్తి గీతాన్ని పాడేవారట.  ఆ విషయం అధికారుల దృష్టికి రాగానే కేంపస్ లో ‘వందే మాతరం’ గీతాన్ని   పాడటాన్ని నిషేధిస్తూ 28 నవంబర్, 1938 నాడు ఉత్తరువులు జారీ చేశాడు నిజాం నవాబ్.

ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించారు.  వీరికి సంఘీభావం ప్రకటిస్తూ  అలనాటి నిజాం రాష్ట్ర ఇతర ప్రాంత (వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్) విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఉద్యమించారు. ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ఠులతో (350 మంది) బాటు ఇతర ప్రాంత విద్యార్థులను కూడా పాఠశాలల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా వరంగల్ లో చదువుతున్న 39 మంది విద్యార్థులను కూడా తొలగిస్తే, వారిలో పీవీ, పాములపర్తి సదాశివరావు ప్రభృతులున్నారు.

ఈ విషయం లో అలనాటి ప్రత్యక్ష సాక్షి కాళోజీ గారు ఏమన్నారంటే: “దాదాపు 600 మంది విద్యార్థులు నాగ్ పూర్ యూనివర్సిటీలో చేరారు.  ఈ సందర్భం లో ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తరిమివేయబడ్డ విద్యార్థులకు మద్రాసు యూనివర్సిటీవారు గానీ, ఆంధ్రా యూనివర్సిటీవారు గానీ చేర్చుకునే అవకాశం కల్గించలేదు.  ‘యూనివర్సిటీని గుర్తించం; కాబట్టి చేర్చుకోం’ అన్నారు.  అప్పటి నాగ్ పూర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కేదార్, యూనివర్సిటీ సెనేట్ లో, ఉస్మానియా యూనివర్సిటీని గుర్తింపు చేయించి ఉస్మానియా విద్యార్థులకు అడ్మిషన్ కల్పించినారు. ఆ 600 మంది విద్యార్థుల చదువు ముగించుకున్న తర్వాత నిజాం రాజ్యంలో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్న వారు దాదాపు 150 మంది. పీ వీ నరసింహారావు, సదాశివరావు ఆ గుంపునకు చెందిన వారే.”   ఈ విధంగా బహిష్కృతులైన  విద్యార్థుల్లో  చాలా మంది నాగపూర్ యూనివర్సిటీలో చేరారు.  వారిలో జూనియర్ ఇంటర్మీడియేట్ చదువుతున్న పీవీ కూడా ఒకరు.

ఉత్తేజ పరచిన నాగపూర్ అనుభవాలు:

ఇంటర్మీడియేట్ లో చేరడానికి పిల్లలు తీరా నాగ్ పూర్ చేరేసరికి వీళ్ళకు తరగతులు నిర్వహించడానికి  తరగతి గదులు  ఖాళీ లేవు, తగు ఉపాధ్యాయులకు ఫ్రీ టైం కూడ లేదు. కాబట్టి   అక్కడి విద్యార్థులకు వేసవి సెలవు లిచ్చినప్పుడు వీరికి తరగతులను ప్రారంభింప నిర్ణయించారు, కాబట్టి తరలివచ్చిన కాందిశీక ఉస్మానియా విద్యార్ఠులకు రెండు మూడు నెలలు చదువు కార్యక్రమం లేదు.  అసలే తిరగడం, నూతనత్వాన్ని పరిశీలించడమంటే ఎంతో ఆసక్తి వున్న పీవీ కి ఈ వెసులుబాటు వరమే అయింది.

మొదటిసారిగా నాగ్ పూర్ చేరిన పీవీకి వింత ప్రపంచం, క్రొత్త వాతావరణం కనబడింది. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకొనడం ప్రారంభమైన ఆ నూనూగు మీసాల వయస్సులో మొదటి సారిగా చూస్తున్న ఈ నూతన జీవన శైలికీ, తానిప్పటి వరకు మెలిగిన నైజాం రాష్ట్ర ప్రజా జీవనానికీ  గల వ్యత్యాసం  పీవీ ని అబ్బుర పరచడమే కాకుండా ఆయనలో  ఆలోచనా శక్తిని ఇనుమడింప జేసింది. 

అక్కడి  స్వేచ్చా వాతావరణాన్ని – ముఖ్యంగా బురఖా లేని స్త్రీలు వీధుల్లో తిరగడం, విద్యార్థినులు సైకిళ్ళ పైన కాలేజీలకు రావడం, విద్యార్థులతో సమంగా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి ఆనందించాడు. ఛత్రపతి శివాజీ, బాలగంగాధర తిలక్ లపట్ల ప్రజలకున్న అభిమానాన్ని, హిందూ మత సంస్కృతి, ఆచార వ్యవహారాల పై వున్న ఆదరణను   గాంచాడు.

వైవిధ్యంతో కూడిన ఈ క్రొత్త స్వేచ్చాయుత వాతావరణంతో  పీవీ ఎంతో ఉత్తేజం పొందాడు. ఆ కౌమార ప్రాయ పీవీ జాతీయ విలోకనలో విస్తృతి పెరిగింది. ఆ నూతన సమాజాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మరాఠీ భాషను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మరాఠీ నాటకాలను, సినిమాలను పరిశీలనాత్మకంగా చూచేవాడు. అసలే మంచి సినిమాలపై మక్కువ గల పీవీ అక్కడి మరాఠీ సినిమాలను చూసి వాటి స్థాయి తెలుగు సినిమాల కంటే ఎంతో ఆధిక్యమని గ్రహించాడు. అక్కడి నటీనటులను అభిమానించాడు. ‘ప్రహ్లాద్ కేషవ్ ఆత్రే’ అనే  గొప్ప రచయిత అలనాటి నాటకాలలో, సినిమాలలో తన రచనల ద్వారా గుప్పించిన హాస్యం పీవీ కి అమితంగా నచ్చింది. తరవాత మనం పీవీ లో గాంచిన హాస్య సంభాషణా చాతుర్యం ఆత్రే ద్వారా సంక్రమించిందేమో?  ఇదే సమయంలో “ యూ కాంట్ టేక్ ఇట్ విత్ యు “ అనే  హాస్యంతో కూడిన ఒక ప్రసిద్ధ ఆంగ్ల  శృంగార చిత్రాన్ని  చూసి ఆంగ్ల  చిత్రాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఈ చిత్ర దర్శకుడిని మెచ్చుకునేవాడు. (ఈ సినిమా 1938 లో ఉత్తమ చిత్రం, దర్శకుడు ఫ్రాంక్ కాప్రా ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులు పొందటం జరిగింది)  

మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే పీవీకి కుస్తీ పోటీలంటే కూడా ఇష్టమేనని నాగపూర్ మనకు తెలుపుతుంది. ఆ రోజుల్లో నాగపూర్ లో ప్రపంచ స్థాయి ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలు జరిగి ఆ పోటీలో అలనాటి మేటి వస్తాదులు హర్బన్ సింగ్, కింగ్ కాంగ్, జెబిస్కో, అర్జున్ సింగ్ మొదలగు వారు పాల్గొన్నారట! అవి అత్యంత జనాకర్షణ కలిగి ఎంతో అద్భుతంగా వుండేవట! ఇక పీవీ యువక రక్తం ఊరుకుంటుందా? ఊరికే ఆ కుస్తీ పోటీలను చూసి ఆనందిస్తే ఆయన పీవీ ఎందుకవుతాడు? ఆ కుస్తీల్లో ప్రయోగించే అనేక రకాల ‘లాక్స్ ‘ (పట్లు) నిశితంగా గమనించ డమే కాకుండా వాటి గురించి మిత్రులతో అనేక విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తుండే వాడు. ఇక పోతే ఆ సంవత్సరం పోటీల్లో గెలుపొందిన హర్బన్ సింగ్ పై మోజు పెంచుకున్న పీవీ ఆ వస్తాదు శక్తి యుక్తుల గురించి మిత్రులకు  లెక్చర్లు గొట్టే వాడట!             

ఇక పీవీ కి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కదా! నాగ్ పూర్ లో కొన్ని మ్యూజిక్ సర్కిళ్ళు ప్రతి ఆదివారం సంగీత సభలు నిర్వహించేవారు. ఇక మన పీవీ అక్కడ క్రమం తప్పని ముఖ్య శ్రోత.   ఆ రోజుల్లో కరీంనగర్ కు చెందిన పీవీ మిత్రుడు నారాయణ రావు అనే అతను హిందూస్థానీ సంగీత గాయకుడు. మంచి పేరున్న వాడు, ఆయన కచేరీలు కూడా సాగేవట, ఇక పీవీ హాజర్ కాకుండా వుంటాడా?   వీటితో బాటు మామూలు తిరుగుళ్ళు ఎలాగూ వున్నాయి. ప్రతి వారం జరిగే సంత లకు హాజరు కావడం అక్కడ దొరికే అన్ని రకాల తినుబండారాల రుచి చూడటం, కారు చౌకగా దొరికే నాణ్యమైన సంత్రా పండ్ల నాస్వాదించడం మామూలే.   

ఆ రోజుల్లో నాగ్ పూర్ లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్ ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది.

ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ నాగ్ పూర్ మీదుగా ట్రైన్ లో వెళుతున్నారని విని పీవీ మిత్రబృందంతో కలిసి ఆయన్ను ప్లాట్ ఫారం పై ప్రత్యేకంగా సందర్శించడమే కాకుండా పీవీ ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు.  ఆ రోజుల్లో నాగ్ పూర్ లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్య కలాపాలను గూడా గమనించాడు.

నాగ్ పూర్ విశ్వ విద్యాలయం జిడ్డు కృష్ణమూర్తి గారి తాత్వికోపన్యాసాలు కొన్ని రోజుల పాటు నిర్వహిస్తే పీవీ తన ముఖ్య సహచరులతో అన్ని రోజులూ హాజర్.   కృష్ణమూర్తి గారి భావాలు పూర్తిగా అర్థంకాకున్నా ఆయన భాషా  వైదుష్యానికి అబ్బుర పడ్డాడు పీవీ.

పీవీ  నాగ్ పూర్ లో వున్నప్పుడే మధ్య ప్రదేశ్ లో “త్రిపురి” కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. జబల్పూర్ దగ్గరి త్రిపురిలొ జరిగిన ఆ మహాసభలకు గాంధీజీ, సుభాష్ బాబు, పండిట్ నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులు వస్తున్నారని ప్రచారం జరిగి ఆ సభలకు దేశం నలుమూలల నుండి లక్షలమంది అరుదెంచారు. పీవీ కూడా ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు.

దాదాపు 300 కిలోమీటర్ల దూరం వున్న జబల్పూర్ దగ్గరి త్రిపురి కి తన సన్నిహిత మిత్రులతో చేరాడు.  లక్షలాది జనాలను జూచి అచ్చెరువందాడు.  ఇంకా ఆ సభల్లో నాయకుల మధ్య జరిగిన తీవ్ర భావ సంఘర్షణ, ఉద్రేకపూరిత చర్చలు, స్లోగన్లతో ప్రచారాలు, వాలంటీర్ల కవాతులు, ఆటల పోటీలు, కోలాటాలు చూచిన పీ వీ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.  ‘భారత దేశమే ఇక్కడ ప్రత్యక్షమయిందా!’  అని మిత్రులతో తన మనస్సులోని భావాలను పంచుకున్నాడు. అక్కడ పంచిపెట్టిన అనేక కరపత్రాలను, రక రకాల ప్రచార ప్రకటన పేపర్లను  ఉత్సాహంగా సేకరించాడు. ఐతే ఆ సమావేశానికి గాంధీజీ రాక పోవడం, సుభాష్ బాబు అస్వస్థతగా వుండటం కొంత నిరుత్సాహాన్ని కలుగజేసినా ఆ మహాసభలకు హాజరవడం ఒక మధురానుభూతిగా భావించాడు పీవీ.

సభలు ముగిసాక, త్రిపురి నుండి   నాగ్ పూర్ తిరుగు ప్రయాణంలో   జబల్పూర్ లో నాలుగు రోజుల మకాం వేశాడు పీవీ.  సమీపంలోని “భేడాఘాట్”ను సందర్శించాడు. అక్కడి పాలరాతి కొండలూ, వాటి మధ్యగా ప్రవహించే నర్మదా నది సొంపులూ తిలకించి తన్మయం చెందాడు. జబల్పూర్ పట్టణం వెనుకబడినదనం, అక్కడి  మురికి వాడలు గమనించాడు.  పీవీ జబల్పూర్ లో వున్నప్పుడే అక్కడ మతకలహాలు జరిగి దాని చేదు అనుభవం కొంత పీవీ కి కూడా తగిలినట్లు  తెలిసింది.

నాగ్ పూర్ చేరగానే క్లాసులు ప్రారంభమయ్యాయి.  చదువుల్లో ఎప్పుడూ పీవీ ప్రధముల్లో ప్రధముడు.    మొత్తానికి ఇంటర్మీడియేట్ పూర్తయింది. తరువాత బి ఎస్ సి చదవడానికి పీవీ పూనా పయనం.  ఐతే మరో విశేషమేమంటే నాగ్ పూర్ వదిలేనాటికి పీవీలో బాల్యచేష్ట లంతరించి పెద్దమనిషి పోకడలు మొదలయ్యాయి.   ఆలోచనా ధోరణి కూడా కొత్త రూపు దిద్దుకోసాగింది. 

పూనా  అనుభవాలు:             

పీవీ పూనా చేరి ఫర్గూసన్  కాలేజీలో బీ ఎస్ సీ కోర్సులో చేరాడు.  పూనా కూడా నాగ్ పూర్ వలె మహారాష్ట్ర సంస్కృతికి కేంద్రం. అంతే కాకుండా బొంబాయి పాశ్చాత్య నాగరికత ప్రభావం నాగ్ పూర్ కంటే పూనా మీద అధికం.

పూనా లోని దక్కన్ యెడ్యుకేషనల్ సొసైటీ, భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మొదలగు  ప్రతిష్ఠాత్మక సంస్థల పనితీరును, అక్కడ సాగే నిరంతర నిర్మాణాత్మక పనులను అధ్యయనం చేసాడు. ఇక సాహిత్య, సంగీత కళా రంగాల మీద మక్కువ గల పీవీ పూనాలోని ప్రముఖ రచయితలు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, చిత్ర నిర్మాతల పేర్లను సంపాదించి జాబితా తయారు చేసుకున్నాడు.  ప్రముఖ కవుల, రచయితల, పాత్రికేయుల రచనలను చదవడమే కాకుండా వాటిపై పరిశీలనాత్మక, విమర్శనాత్మక అభిప్రాయాలు వెలిబుచ్చేవాడు. ఇక ప్రముఖ కళాకారుల మరాఠీ నాటకాలను, చిత్ర నిర్మాతల సినిమాలను చూసి మెచ్చుకోవడం, కొన్ని సందర్భాలలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేసేవాడు. ఇక హిందూస్థానీ సంగీతమంటే అతి మక్కువ గల పీవీ పూనాలో ఎన్నో సంతృప్తికర సంగీత కార్యక్రమాలు హాజరు కాగలిగాడు. 

 పీవీ పూనా చేరిన సమయం లోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. జాతీయ నాయకుల ప్రసంగాలలో యుద్ద్గ వ్యతిరేక వైఖరి ప్రస్ఫుట మయ్యేది. అదే సమయంలో సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రజల మధ్య చర్చనీయాంశం ఐంది. అప్పుడే ‘పీపుల్స్ ఏజ్’ అనే వార పత్రిక ప్రారంభమైంది. దాని కొన్ని సంచికలను చదివిన పీవీలో పత్రికా రచన, పత్రిక ప్రచురణ మీద మక్కువ పెంచుకొని వివిధ పత్రికలను విమర్శనాత్మక దృష్టితో చదవడం సాగించాడు. ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుల, నాటకకర్తల, ఇతర మేధావుల రచనలను చదివాడు. చార్లీ చాప్లిన్, వాల్ట్ డిస్నీ, పికాసో, ఐన్ స్టీన్, సీ వీ రామన్ లాంటి మహోన్నత మేధావుల గురించి అధ్యయనం చేసాడు.

బాల్య చాపల్యం తొలగిపోతూ మేధస్సు నిర్ణయాత్మక ఆలోచనా ధోరణులను స్థిరీకరించే ఆ కౌమార వయస్సులో పూనాలో పీవీ చేసిన వివిధ అధ్యయనాలు ఆయన జ్ఞాన సంపత్తి పెరుగుదలకు బాటలు వేసాయి అని అనుకోవచ్చు. సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ భావ ప్రకటనలో, అనుసరించవలసిన పద్ధతిలో  స్వీయ నిర్ణయాలు   తీసుకోవాల్సిన మెలకువలను పీవీ నేర్చుకొనడం  అప్పుడే మొదలైంది. అనేక వైరుధ్యాలతో కూడిన సమస్యలను అవగాహన చేసుకొనడం, ఆ సమస్యల పరిష్కార విధానం స్వంతంగా రూపొందించడం  మెల్లిమెల్లిగా నేర్చుకొనడం   ఆరంభమయింది. ఒక విధంగా చెప్పాలంటే   అతిగా మాట్లాడే, తిరుగుళ్ళ అమాయకపు పీవీ ప్రవర్తన, వ్యక్తిత్వం అదృశ్యమవుతూ  తక్కువ మాట, గంభీర ఆలోచనా ధోరణి,   అంటీ ముట్టని నడవడి రూపుదిద్దుకోవడం  మొదలైంది పూనాలోనే. ఇక  పీవీ పూనాలో తిరుగని వీధి లేదు, హాజరు కాని సినిమా హాలు లేదు.  ‘టీ’  సేవింపని హోటలు లేదు.  పూనా చుట్టు ప్రక్కల గల చూడ తగిన ప్రదేశాలన్నీ చూడటం జరిగింది.   

ఇదంతా కాలేజీ వెలుపలి వివరాలు.  ఇక కాలేజీ వ్యవహారాలను చూస్తే, చదువులో ఇక్కడా ఫస్టే! ఇకపోతే, కాలేజీ విద్యార్థి సంఘం నిర్దేశించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. కాలేజీ నిర్వహించిన వక్తృత్వ పోటీలో, ఇంకా ఆటలల్లో టెన్నిస్ పోటీలో పాల్గొన్నాడు.  కాలేజీ మేగజైనులో రచనలు చేసాడు.

మిగతా కాలేజీ విద్యార్థుల్లాగే పీవీ లో కూడా ‘సౌందర్యారాధన’ భావం అంతో ఇంతో వుందన్నది కూడా వాస్తవం. ఐతే సహజంగా బిడియస్తుడు కాబట్టి ఇటువంటి మనో దౌర్బల్యం పీవీ లో తక్కువే అని చెప్పుకోవాలి.  మొత్తానికి పూనా నుండి గ్రాడ్యుయేటు గా హైదరాబాద్ చేరుకున్నాడు పీవీ, డిగ్రీతో బాటు ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తిత్వంతో.  అక్కడ  నుండి వంగరకు.

మొదటి సారి భావ సంఘర్షణ

వంగరలో కుటుంబ సభ్యుల కలయికతో మునుపటి స్వైర విహారాల, చర్చోప చర్చల పీవీ, సంగీత సభల్లో ‘వాహ్’ శ్రోతగా, క్లాసు లో ఫస్ట్  మార్క్ ఆన్సర్  షీట్ల తో పాటు  ఉపాధ్యాయుల ప్రశంసల్ని అందుకున్న విద్యార్థిగా – ఇలాంటి ఎన్నో ఆనందకర పాత్రల్ని పోషించి ఇన్నేండ్లు ఆకాశంలో విహరించిన పీవీ ఒక్క సారిగా కుటుంబ బాధ్యతలు, ఆదాయ వ్యయ చిట్టాలు తెలిసి రావడంతో భూమిపైకి దిగి వచ్చాడు. భావ సంఘర్షణ మొదలయింది. ఏదైనా ఉద్యోగం చేయడమా లేక వంగరలో స్థిరపడి వ్యవసాయం చేసుకోవాలా?… మరో చిన్న కోరిక కూడా  మనసులో మెలుగుతోంది.  ‘పై చదువులు చదవాలని’! వేసవి సెలవుల్లోపల ఈ “కిం కర్తవ్యం?” అనే దానికి సమాధానమివ్వాలి. తరగతి చదువుల ప్రశ్నలకైతే ఠకీ మని సమాధానం రాసి మొదటి మార్కులు కొట్టేసే  పీవీకి ఈ  బ్రతుకు చదువు ప్రశ్నకు  బాగా ఆలోచించవలసి వచ్చింది. తుదకు ఉద్యోగం ‘జాన్ తా నహీ’, వ్యవసాయం ‘మాన్ తా నహీ’ అనుకున్నాడు. ‘వకాలత్ పఢ్ నా హీ మేరీ పసంద్ హై’ అని నిర్ణయించుకున్నాడు – అదీ తన ఫేవరిట్ ఊరు నాగ్ పూర్ లో.

నాగ్ పూర్ పాతదే – కాని పీవీ వ్యాసాంగాలు కొత్తవి

     నాగ్ పూర్ లో గది అద్దెకు తీసుకొని కాలేజీలో చేరి ‘లా’ చదువు ప్రారంభించాడు పీవీ. కానీ వెనకటి తిరుగుళ్ళ  పీవీ కాదు. 

 ఇకపోతే రెండవ ప్రపంచ యుద్ధం చాయలు మన దేశంలో కూడా వున్నాయి, మరో వైపు బెంగాల్ లో దారుణ క్షామ స్థితి. ఇక జాతీయ నాయకులంతా జైళ్ళలో వున్నారు.  దేశంలో రాజకీయ స్తబ్ధత,   ప్రజలలో నిరుత్సాహం నెలకొని ఉన్నాయి.

పరిస్థితులని అర్థం చేసుకున్న పీ వీ తన కలానికి పని చెప్పాడు. తన లోని వివిధ భావాలని వ్యక్త పరుస్తూ కొన్ని కవితలు, వ్యాసాలు రాసాడు.  వాటిలో బెంగాల్ కరువు భూమికతో రాసిన ఒక కథ ఇతివృత్తం అద్భుతమని   పీవీ సన్నిహిత మిత్రులు పేర్కొనే వారు.  కథ ఇలా సాగుతుంది… ‘కరువు రక్కసికి కుటుంబ సభ్యులను కోల్పోయి ఏకాకిగా మిగిలిన ఒక యువతి ఆకలి కాగలేక  చివరకు భిక్షమెత్తుకునేందుకు సన్నద్ధమౌతుంది. కాని బిచ్చం కూడా లభ్యం కాని దురవస్థ స్థితిలో తన శరీరాన్ని కూడా అమ్ముకునేందుకు సిద్ధమవుతుంది.’ ఆత్మాభిమానం కల ఆ యువతి తన దిగజారుడు తీరుకు పడే ఆమె మనో వేదనను ‘అద్భుతంగా చిత్రీకరించాడు పీవీ’ అని ఆ మిత్రులు చెబుతారు. అంటే వెనుకటి పీవీకి, ప్రస్తుత చైతన్య పూరిత భావ ప్రకటన చేయగల ఆలోచనా ధోరణులు, రచనా ప్రక్రియలో నేర్పూ గల పీవీకి మధ్య వ్యత్యాసం నాగపూర్ పట్టణానికి కూడా అర్థమయివుంటుంది.

ఈసారి నాగ్ పూర్ లో పీవీ విద్యార్థి జీవనం లో ఒక క్రొత్త పరిణామం సంభవించింది. అప్పుడే క్రొత్తగా నాగ్  పూర్ లో ఆహార రేషనింగ్ విధానం  ప్రవేశపెట్టారు. ఉద్యోగానికై ఒక దరఖాస్తు పడేసి చూద్దాం అని పీవీ దరఖాస్తు చేయగా ఆయనకు ఇన్ స్పెక్టర్ గా నియామకం వచ్చింది. ఈ వుద్యోగంలో చేరి పీవీ సంపాదిస్తూ ఆ డబ్బుతో నే చదువుకున్నాడని తెలుస్తుంది. ఇది పీవీ లో ఎంతో ఆత్మ సంతృప్తి కలగ జేసింది అని సన్నిహిత మిత్రుల వ్యాఖ్యానం.         

అదే సమయంలో పీవీకి శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు  సహాధ్యాయి. రామానుజరావుగారు  పీవీ లో శ్రీ  విశ్వనాథ సత్యనారాయణ గారి  నవలల  గురించి ఆసక్తి కలిగించినట్లు తెలుస్తుంది. దీనితో పీవీ విశ్వనాథ వారి రచనలు ‘ఏక వీర’, ‘ చెలియలి కట్ట ‘, ‘వేయి పడగలు’ చదవడం జరిగింది.

ఇకపోతే, పీవీలో నాగ్ పూర్ లోని ప్రముఖ వ్యక్తులను కలిసి వారితో పరిచయాలను యేర్పరుచుకోవాలన్న కొత్త వ్యాసంగం మొదలయింది. అప్పటికే నాగ్ పూర్ లో వున్న ప్రముఖ తెలుగు వారిని కలిసి వారితో స్నేహమేర్పడి  కబుర్లు చెప్పుకొనడం జరుగుతుండేది. ఈ కబుర్లలో   పీవీ కి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన వుంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి వారితో దీర్ఘ వాదోపవాదాలు చేసేవారట! అట్లాగే చాలా మంది ఉత్తర భారతీయులు ఆంధ్ర ప్రాంతం వారిని ‘మద్రాసీ’లుగా భావించే వారనీ, కర్నాటక సంగీతాన్ని ‘అరవ మేళంగా ‘ అనుకునే వారనీ, త్యాగరాజ కీర్తనల భాష తమిళంగా భావించేవారనీ వారికి గూడా నిజ వివరాలు చెప్పేవారని తెలిసింది.  

మొత్తానికి – పీవీ నాగ్ పూర్ నుండి లా డిగ్రీ, దానితో బాటు వినూత్న అనుభవాల తోడు తీసుకొని ఇక భవిష్యత్ జీవన సంగ్రామానికై    హైదరాబాదు చేరాడు. లా డిగ్రీ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ అని చెప్పనవసరం లేదు కదా!

అనేక భావ సంఘర్షణల మధ్య భవిష్యత్ జీవన దిశా నిర్దేశం  – రాజకీయాల  వైపుగా

చదువు ముగించి భవిష్యత్ బ్రతుకు బాటలో పయనించడానికి 1945 లో న్యాయ శాస్త్ర పట్టాతో పీవీ హైదరాబాదు చేరి ప్రఖ్యాత న్యాయవాది శ్రీ బూర్గుల  రామకృష్ణారావు గారి దగ్గర  జూనియర్ గా చేరాడు. బూర్గుల గారి నాయకత్వ లక్షణం, నానా ముఖ ప్రతిభ, వ్యవహార దక్షత పీవీకి బాగా నచ్చాయి.  చదువులో లాగానే  వకాలత్ వ్యవహారంలోనూ పీవీ  అందరి మన్నన పాత్రుడయ్యాడు. హైకోర్టులో పీవీ వాదనా పటిమ సీనియర్ లాయర్ల మెప్పును పొందింది.  వాదనలో తాను చెప్పే పాయింట్స్ వివరంగా, విషయ పరిజ్ఞానంతో కూడి వుండేవని, కేసు నెగ్గించుకోవడంలో పీవీ చూపే వాదనా చాతుర్యం, అందులో చూపించే ఆధార వివరాలు పేరుమోసిన లాయర్లనే          చకితులను చేసేవట.

ఇక పీవీ హైదరాబాదు చేరేసరికి అక్కడ రాజకీయ సాంఘిక పరిస్థితు లెట్లున్నాయో క్లుప్తంగా తెలుసు కుందాం. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్నది. యుద్ధ ఒడి దుడుకుడుల వలన విపరీతంగా పెరిగిన ధరలు, ఆహార రేషనింగ్, సివిల్ సప్లై  సరుకుల కొరత మున్నగు నిత్య కష్టాలు హైదరాబాదు  ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

అప్పటికే కాళోజీ నారాయణ రావు గారు హైదరాబాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.  కోర్టుకు వేసవి సెలవు లిచ్చినప్పుడు పీవీ, కాళోజీ లిద్దరూ మహా బలేశ్వర యాత్రకు బయలు దేరారు.  ఈ యాత్రా విశేషమేమంటే మహాబలేశ్వర ప్రకృతి సౌందర్యాన్ని రికార్డ్ చేసి మిత్రులకు చూపించాలని ఒక కెమెరా కొని ఫోటోగ్రఫీ అనే నూతన సరదా ప్రారంభించాడు పీవీ. ఫోటోగ్రఫీ కి చెందిన వివిధ టెక్నికులు నేర్చుకొనుటయే కాక సన్నిహిత మిత్రులకు  అవి సోదాహరణంగా వివరించేవాడు. ఈ యాత్ర నుండి తిరిగివచ్చేప్పుడు బొంబాయిలో ఆగి బాంబే స్టాక్ మార్కెట్ ను సందర్శించాడు. అక్కడ షేర్ మార్కెట్ విధానం గురించి తెలుసుకున్న పీవీకి కొద్ది మంది పారిశ్రామిక, బ్యాంకర్ కుబేరుల  గుప్పిట్లో జాతీయ ఆర్థిక స్థితి గతులు  నిగూఢంగా  ఒదిగి యున్న జటిల సమస్య పీవీ  సవిమర్శక దృష్టిని ఆకర్షించి వినూత్న సమాలోచనలకు ప్రేరణ ఇచ్చింది. యాత్ర నుంచి హైదరాబాదుకు తిరిగి రాగానే వకీళ్ళిద్దరూ తమ కోర్టు వ్యవహారాలల్లో మళ్ళీ బిజీ బిజీ.    

ఇక హైదరాబాదు రాష్ట్ర రాజకీయాల్లో, నిజాం ప్రభుత్వంపై జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో తీవ్ర మార్పులొచ్చాయి. ఒక వైపు మైసూర్ స్టేట్ పరిపాలనలో అనుభవమున్న ‘మీర్జా ఇస్మాయిల్’ ను హైదరాబాద్ రాష్ట్రానికి తెచ్చి ముఖ్యమంత్రిగా నియమించాడు నిజాం. ఈయన ప్రోద్బలంతో హిందూ ప్రజలను ఆకట్టుకొనడానికి “హిందూ-ముస్లిం రెండు కండ్ల సమాన ప్రాతినిధ్యం” అనే కొన్ని నూతన  సంస్కరణలు ప్రతిపాదించాడు.

కానీ ఆచరణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వృత్తి నియామకాల్లోనూ ముస్లిములనేమో రాజ బంధువులుగా, హిందువులనేమో ప్రజా సేవకులుగా పరిగణించడం జరుగుతూ అనేక అపోహలకు కలతలకు దారితీసేది.

నిజాం వ్యతిరేక రాజకీయ ఉద్యమం కూడా కొత్త మలుపులు తిరిగింది. అప్పటిదాకా నిషేధంలో వున్న స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం నిషేధం ఎత్తేయడంతో మళ్ళీ ప్రారంభమై నిజాం ప్రభుత్వ ప్రతిపాదిత సంస్కరణలను వ్యతిరేకించింది.

ఇక నిజాం వ్యతిరేక ఏకైక తెలంగాణా ప్రజా ఉద్యమ సంస్థ ‘ఆంధ్ర మహా సభ ‘ రెండుగా చీలి పోయింది. కమ్యూనిస్టుల సారథ్యంలో ‘కమ్యూనిస్ట్ ఆంధ్ర మహాసభ’ అనీ,   కమ్యూనిస్టేతర నాయకుల సారధ్యంలో ‘ జాతీయ ఆంధ్ర మహాసభ’ అనీ విడివిడిగా పని చేయడం మొదలు పెట్టాయి. ఈ రెండూ కూడా నిజాం సూచించిన సంస్కరణలను వ్యతిరేకించాయి.      

వీటన్నిటి మూలంగా హిందువులు, ముస్లిముల మధ్య వైమనస్య వాతావరణం పెరగ సాగింది. మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది.

దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.  

పౌర జీవనంలో అనిశ్చిత వాతావరణం అలుముకొనసాగింది. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు ఈ విపరీత పరిణామానికి కలవరపడ సాగారు.

ఇక పీవీ లో కూడా న్యాయ వాద వృత్తిపైన, ఆ వృత్తి పై గల గౌరవం, దాని స్థిరత్వం, భద్రత పైన గల ఆత్మ విశ్వాసం తగ్గుతూ దానిపై శ్రద్ధాసక్తులు   సడలిపోసాగాయి. మానసికాందోళన మొదలైంది.  మళ్ళీ ‘ కిం కర్తవ్యం?’ ఆలోచనలు. ఈ సారి అది ‘భవిష్యత్ జీవన మార్గ నిర్ణయ’ ప్రశ్న! ఈ మానసిక ఆందోళన పరిస్థితుల్లోనే  ‘అప్రెంటిస్ షిప్’ పూర్తై  అడ్వకేట్ గా బోర్డ్ కట్టాడు.  కేసులు, కోర్టు పని బాధ్యతలపై కంటే భారత దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై ఎక్కువ దృష్టి సారించాడు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ వుద్యమం లో ‘ఎవరికి వారే’ అన్న  చందాన  వ్యవహరించడం  వల్ల పురోగమన సూచనలు కనబడటం లేదు. మత రాజకీయ ప్రేరణనే ప్రజల మనో భావాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గ్రహించ గలిగాడు  పీవీ. 

1945 -47 ల మధ్య పీవీ విస్తృత అధ్యయనాలు చేసాడు.  థామస్ కార్లయిల్, రస్కిన్, లెనిన్, బేకన్ మున్నగు సాంఘిక తత్త్వవేత్తల రచనలను, పలు చారిత్రిక, అర్థ శాస్త్ర  గ్రంధాలను చదివాడు. మొపాసా, బాల్ జాక్,  ఉమర్ ఖయ్యూం రచనలు కూడా చదివాడు.

ఆరోజుల్లో సాంఘిక, రాజకీయ అస్థిమిత వల్ల యువకులు సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. గ్రంధాలయ సభలు, కవి సమ్మేళనాలు,   రచయితల వేదికలు తరచుగా జరిగేవి.  పీవీ, కాళోజీ, సదాశివరావులు అప్పుడప్పుడూ వీటిల్లో పాల్గొనే వారు. ఐతే పీ వీ కి తెలుసు – యివి కేవలం కాలక్షేప వ్యాపకాలే తప్ప రాజకీయ అస్థిరతకు ప్రత్యామ్నాయ మార్గాలు కావని!

ఆ రోజుల్లోనే తెలంగాణాలో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’  ప్రాచుర్యం పొందింది. దేవులపల్లి రామానుజ రావు ”శోభ” అనే పత్రికను నడిపారు. వరంగల్ లో 1942 ప్రాంతంలో పాములపర్తి సదాశివరావు మార్గదర్శకత్వంలో పట్టణ వ్యాపార పెద్దల సహకారంతో శ్రీ రాయపరాజు వెంకట్రామారావు గారి అధ్యక్షతన ‘కాకతీయ కళా సమితి ‘ని  నెలకొల్పి ప్రతి యేడూ త్యాగరాజ మహోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించేవారు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రముఖుల (ద్వారం వెంకటస్వామి నాయుడు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, దంతాలపల్లి పురుషోత్తమ శాస్త్రి  మొదలగు వారి)  సంగీత సమ్మేళనాల్ని నిర్వహించడమే కాకుండా నాటికలు, వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, స్త్రీలకు చర్చా కార్యక్రమాలు,  కవి, కథక సమ్మేళనం లాంటివి నిర్వహించే వారు.   ఆ మూడు రోజులు వరంగల్ ప్రజలకు ఒక పండుగ వాతావరణం వుండేదని అంటారు. ఆ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కవి సమ్మేళనానికి పీవీ అధ్యక్షత వహించిన సందర్భాలు కూడా వున్నాయి.    1943 నుండి 1958 దాకా సుమారు 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా పనిచేసిన కాకతీయ కళా సమితి   తరువాత కనుమరుగైంది.

శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో …  “కాకతీయ  కళా సమితి కార్యక్రమాల్లో శ్రీ పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించేవారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది”. 

`         అదే సమయంలో రచనా వ్యాసంగంలో కూడా ఉత్సుకత వుండటం వల్ల 1945 లో సదాశివరావు గారు వారం వారం  ‘కాకతీయ సారస్వత సంకలనం’ పేరుతో నాలుగు పేజీల కరపత్రంలాంటి పత్రికను తీసేవారు. ఇందులో వీరికి అడవాల సత్యనారాయణ రావు గారి తోడ్పాటు వుండేది. ఆ సంకలనాలలో పీవీ పలు రచనలు చేశాడు. పీవీ రాసిన ‘మానాప మానాలు’ అనే నవల కూడా అందులో ముద్రింపబడింది. ఆ విధంగా పీవీ రచనలు మొదటి సారిగా ముద్రింప బడటం జరిగింది.

ఒక ‘గురువు’ – ‘లఘువులు’ కాని శిష్యులు ముగ్గురు

గార్లపాటి రాఘవరెడ్డి గారు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషల్లో పాండిత్యము కలిగిన గొప్ప తాత్త్విక కవి. నిరాడంబరంగా ఆర్య సమాజ ‘ఆశ్రమం లో తన జీవనం గడిపి 1966 లో పరమపదించారు. 

అహంకార రహిత సహజ సామాన్యత పరిఢవిల్లిన ఆత్మనివేదనను వేణుగోపాలకుడికి ఛందోమయంగా  అతి మనోహరంగా నివేదించిన ఆయన  ‘పరిదేవనము ‘ ఒక గొప్ప శతక కావ్యము. వీరి ఇతర రచనలు సావిత్రి (ఖండ కావ్యం), రతి విలాపం (ఖండ కావ్యం), గోపికా వల్లభ (అసంపూర్ణ శతకము).   ఆను నిత్యం   సత్యాన్వేషణ తప్ప యేమాత్రం  కీర్తి కండూతి,  ప్రచార పటాటోపం   లేని ఆయన రచనలు, కావ్యాలు అముద్రితాలుగానే మిగిలిపోయాయి. అలనాటి కాకతీయ పత్రికలో (1947 -1956) ఆయన అనేక రచనలు ప్రచురిత మయ్యాయి. కానీ పుస్తక రూపాన ప్రచురితం కాకపోవడం చింతించ వలసిన విషయం.

1945 ప్రాంతాల్లో వరంగల్ వచ్చిన “కవి సామ్రాట్”  శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని కాళోజీ గారి ఇంట్లో కాళోజీ గారి ప్రోద్బలంతో  రాఘవరెడ్డి గారు కలవడం  జరిగింది.  విశ్వనాథ వారు అడిగినంతనే   రాఘవరెడ్డి గారు తమ ‘పరిదేవనము’ కావ్యం నుండి ఒక పద్యం చదివారు. మొదటి పద్యానికి చకితులైన విశ్వనాథ వారు రెండవ పద్యానికి ఆనందంతో రాఘవరెడ్డి గారి ప్రక్కకు చేరారు.ఇక ముచ్చటగా మూడవ పద్యం చదవగానే రాఘవరెడ్డి గారినిని కౌగలించుకొని ‘ ఇక్కడ ఇంత మంచి కవులున్నారా!’ అని ఆనందాశృవులు తెచ్చుకున్నారట. అంతటి కవిరాజు విశ్వనాధవారు  మెచ్చిన నిజమైన నిరాడంబర మూడు  (తెలుగు, సంస్కృతం. హిందీ)భాషల  కవి రాఘవ రెడ్డి గారు!  

           ఇంతటి గొప్ప పండితుడిని ‘గురువు’గా కలిగిన అ ముగ్గురు ప్రియ శిష్యుల గురించి పేర్కొంటే రాఘవరెడ్డి గారి పాండిత్య ప్రతిభ యేమిటో మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురూ మహా మహులే! లబ్ధ ప్రతిష్టులే!! తమ తమ రంగాలలో పేరెన్నిక గల వారే!!!

మొదటి వారు – ఆయనకు అత్యంత ప్రియ శిష్యుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు. ఫ్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల బాధల కన్నీటి గుర్తులను తన గొడవలుగా వినిపించి అన్యాయాన్ని ఎదిరించిన ‘కన్నీటి కవి’.

రెండవ వారు – మహా మేధావి, సాహిత్య దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, పూర్వ ప్రధాన మంత్రి – శ్రీ పీ వీ నరసింహా రావు గారు.

ఇక మూడవ వారు – ప్రఖ్యాత మార్క్సిస్టు తత్త్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ  పాములపర్తి సదాశివరావు గారు. “లఘువులు” కాని ఇంతటి విశిష్ఠ శిష్యులను కలిగిన ఆ ‘రాఘవుడు’ నిజమైన గురువుకు నిర్వచనం!

ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు; మూడు విభిన్న దృక్పథాలు; మూడు వైవిధ్య జీవన విధానాలు… ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు

 పీవీ గారు రాసిన ‘ఇన్ సైడర్ ‘ గ్రంథం ముందు మాటలో గార్లపాటి రాఘవరెడ్డి గారి పేరు, పాములపర్తి సదాశివరావు గారి పేరు పేర్కొనడం జరిగింది.

ప్రఖ్యాత హిందీ కవయిత్రి ‘మహా దేవి వర్మ ‘ ప్రభావం ఆయనపై ఎంతైనా వుంది. పీవీ కి మహా దేవి వర్మ కవితలపై ఆసక్తి కలిగించిన వారిద్దరు.  ఒకరు గార్లపాటి రాఘవరెడ్డి గారైతే మరొకరు కాళోజీ రామేశ్వరరావు గారు. వీరు కాళోజీ నారాయణ రావు గారికి అన్నగారు మరియు ప్రఖ్యాత ఉర్దూ కవి. ఈ పెద కాళోజీ గారు ‘షాద్ కవి ‘ గా పేర్గాంచినారు.

పీ వీ సాహిత్యావలోకనం, భావ ప్రకటనలను ఇనుమడింప జేసిన గురు రాఘవుడు 

1945లో  పీవీ మొదటిసారిగా గార్లపాటి రాఘవరెడ్డి గారిని కలిసారు. ప్రఖ్యాత ఆంగ్ల కవి ‘థామస్ గ్రే’ రాసిన కవిత్వం ‘ఎలిజీ’ని పీవీ తెలుగు లోకి అనువాదం చేశాడు. దాన్ని మిత్రుడు సదాశివుడికి వినిపింపగా గార్లపాటి రాఘవరెడ్డి గారు అదివరకే దానిని తెలుగులోకి అనువదించారని మిత్రుడు చెప్పగా ఇద్దరూ కలసి రాఘవరెడ్ది గారుండే ఆశ్రమానికి పోయి ఆయన్ను కలిసారు. ఆ విధంగా రాఘవరెడ్డి గారితో పరిచయం జరిగింది. రెడ్డి గారూ, పీవీ ఇద్దరూ తమ అనువాదాలను పరస్పరం చదివి వినిపించుకున్నారు.  ఈ పరిచయం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగి పీవీ రాఘవరెడ్డి గారి శిష్యుడయ్యాడు. అంతకు ముందే రాఘవరెడ్డి ప్రియ శిష్యుడు కాళోజీ నారాయణ రావు. ఆయనకు తోడుగా పీవీ, సదాశివరావులు శిష్యరికం చేసిన గురువు రాఘవరెడ్డి గారు.  వీరిద్దరు రాజకీయ ఆలోచనా విధానం తప్పిస్తే సాహిత్యమైనా, సంగీతమైనా ఆస్వాదించడమే కాకుండా వాటిపై సమగ్ర విశ్లేషణను చేసే సామర్థ్యత కలిగిన జంట మేధావులు. ఈ విషయాన్ని ఆనాడే తెలుసుకున్న ఆ గురు రాఘవుడు వారిని ‘ జయ- విజయులు ‘ గా సంబోధించే వారు. క్రమేణా ఆ పేర్లే సార్థక నామధేయాలుగా మారాయంటారు. అలనాటి ‘కాకతీయ పత్రిక’ లో పీ వీ గారు రాసిన ‘గొల్ల రామవ్వ ‘ కథ రచయిత ‘విజయ ‘ పేరుతో ప్రచురితమైంది.  వీరిద్దరూ రాఘవరెడ్ది గారిని ‘గురు’ అని సంబోధించేవారు.

పీవీ తరచూ ఆశ్రమానికి పోయి రాఘవ రెడ్డి గారితో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాడు. రాఘవరెడ్డిగారికి తిరుపతి వెంకట కవుల,  ప్రబంధ కవుల, శతక కవుల వందలాది పద్యాలు కంఠస్థం. ఉభయుల   మధ్య తిరుపతి వెంకట కవుల పద్యాలు, వెంకట పార్వతీశ్వర కవులు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, రాయప్రోలు సుబ్బారావు మున్నగు వారి కావ్య శిల్పంపై ఇష్టా గోష్టి సాగేది. అంతే కాదు రాఘవరెడ్డి గారు మను చరిత్ర, నైషధం  లాంటి ప్రబంధాలు, కాళిదాసు, భవభూతి లాంటి కవుల శైలీ విన్యాసం పై పీవీ కి ఆసక్తి కలిగించారు. పీవీ  కూడా గురువు  గారికి  వర్డ్సు వర్తు, షెల్లీ, కీట్స్, బైరన్ కవితలు, షేక్సు పియర్ నాటకాలు, థాకరే, హార్డీ, డికెన్సు  నవలల పరిచయం చేసాడు. ఈ ఇరువురి కలయిక “ప్రాచీనత – ఆధునికత “సమ్మిశ్రితమై  ఇద్దరిలోనూ సమంగా   పెంపొందినట్లు తెలుస్తుంది.  అందుకు ఉదాహరణగా రాఘవరెడ్డి గారు భావ గీతాలు,  పీవీ గారు శృంగార గీతాలు రచించడం లాంటి ప్రయోగాలు…   

1946లో రాఘవరెడ్డి గారి ‘పరిదేవనం’ కావ్యం ప్రచురితమైంది. గురువు గారికి తెలియకుండానే శిష్యుడు   సదాశివుడు ప్రచురించడమే కాకుండా అందులో గురు కావ్యరచనకు ‘శిష్య పీఠిక’ గూర్చాడు. ఆ శిష్య పీఠిక ఇలా మొదలవుతుంది: “శ్రీ కాళోజీ ప్రియ శిష్యుడు, శ్రీ గార్లపాటి గురువుగారు. మా జయ విజయులము వీరిని గురువు గారని సంబోధించుట యాదృచ్ఛికంగా జరిగియున్నను రాను రాను సార్థక సంబోధన యగుచు వచ్చుచున్నది. పిన్నల గ్రంధములకు పెద్దలు పీఠిక వ్రాయుట యాచారం. కానీ ఇట శిష్యుడే గురుని గ్రంధమునకు పీఠిక వ్రాయుచున్నాడు…..”

“భారతీయ సాహిత్య సాంప్రదాయాన్ని చదవడానికి నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయడానికి నాలో తపన పెంపొందించిన నా  సాహిత్య  గురువు, దివంగత  శ్రీ  గార్లపాటి రాఘవరెడ్డి  గారికి నేను కృతజ్ఞున్ని”  అని శ్రీ పీవీ గారే ఆయన ఆత్మకథలాంటి నవల ‘ది ఇన్ సైడర్’ (The Insider) లో పేర్కొన్నారు.

కాళోజీ గారొక చోట యీ విధంగా అన్నారు: “గురువు గారు రాఘవరెడ్డి గారూ, రామేశ్వరరావు గారూ, పాములపర్తి సదాశివుడూ, పీవీ కలిసి హిందీ కవితలు చదువుకొని వినిపించి చర్చించే వారు.  ఆ చర్చల ఫలితమే రాఘవరెడ్డి గారు చేసిన మహాదేవి వర్మ అనువాదాలు, నందలాల్ రచించిన ‘ఉద్ధవుడు –గోపికలు’ సంవాదానికి పీవీ అనువాదం”.  గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక – మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది.

ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న ‘ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ సమీక్షలను రాసేవాడు, హిందీ సాహిత్యం నుండి అనేక రచనలను తెలుగులోకి అనువదించడం లాంటి వ్యాపకం పెట్టుకున్నాడు. ఇది బహుషా గురు రాఘవుడి ప్రోద్బలమేమో?

ఈ నేపధ్యంలో ‘కాకతీయ పత్రిక’ను ఒక వార పత్రిక గా 1948 లో ప్రారంభించారు. కాకతీయ పత్రిక ముద్రణాలయం, కార్యాలయం సదాశివరావు ఇంటి ముందు భాగంలోని గదుల్లో వుండేవి.  పైన వున్న బంగ్లా రూం లో సదాశివరావు. ఆయన రచనా వ్యాసంగం, ఇతర మిత్ర బృందంతో చర్చా గోష్టులు.  నెలలో 5 లేదా 6 సార్లు పీవీ గారి రాక. వచ్చినప్పుడు ఒకటో రెండు రోజులో మకాం, గార్లపాటి గారు, కాళోజీ సోదరులు వారానికొకసారి. దినమంతా అక్కడే! ఎప్పుడూ సాహిత్య చర్చలూ, ఇతర వ్యాసాంగాలతో కళకళ లాడింది ఆ మేడ గది, 1955 దశకపు అర్ధభాగం దాకా ఈ సాహిత్య సమ్మేళనాలు జరిగేవి. అప్పుడప్పుడూ అనుముల కృష్ణమూర్తి, పల్లా రామకోటార్య, హరి రాధాకృష్ణమూర్తి లాంటి పండితులు కూడా పాల్గొనేవారు. కొన్ని వందల సార్లు ఆ గురు రాఘవుని సాంగత్యం లో జరిగిన ఆ సాహిత్య విమర్శనాత్మక చర్చాగోష్టులు అసలే మేలు రత్నం లాంటి పీవీ గారి మేధస్సుకు మరింత పదును పెట్టాయంటే అతిశయోక్తి లేదు. విద్యార్ఠి దశలో అంకురించిన సుస్ఫష్ట భావ వ్యక్తీకరణం, విలక్షణ ఆలోచనా ధోరణి మొదలగు సుగుణాలు ఆయనలో ఇనుమడించడం జరిగింది గురు రాఘవుడి మార్గ దర్శకత్వం లో అప్పుడే… అక్కడే! 

ఒక విధంగా చెప్పాలంటే  పీవీ గారి జీవన మధురిమలు వారు  వరంగల్ లో గడిపిన బాల్య విద్యార్థి దశా, ఆ తర్వాతి కాలంలో ఆయన ఆపుడప్పుడూ వచ్చి నెలలో పదిహేను రోజులైనా గడిపిన ఆ కాకతీయ పత్రిక ప్రచురణల సమయం కావచ్చు. ఇందుకు కారణం ఆయన అమితంగా యిష్టపడే   సాహిత్య సంగీత రంగాల మిత్రులతో సాగించిన సమ్మేళనాలు- రాజకీయ వాసనలు లేని మిత్ర బృందం నిష్కల్మష వ్యవహారతీరు. ఆ మహనీయులందరికీ  మా  నమస్సుమాంజలులు.

***

= శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి , పాములపర్తి నిరంజన్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami