KakatiyaPatrika.com Header Image

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

( ఈ క్రింది వ్యాసం శ్రీ టీ. శ్రీరంగస్వామి గారి సంపాదకత్వంలో, శ్రీలేఖ సాహితీ వారిచే ప్రచురింపబడిన “ఏకశిలా వైతాళికులు” అనే 1991 ముద్రణ లో శ్రీ పల్లేరు వీరస్వామి (నాగారం, పరకాల) గారిచే వ్రాయబడినది. )

ఆలోచనల నేస్తూ ఆచరణలలో అమలు పరుస్తూ ఆర్భాట పటాటోపాదులను తూర్పారబడుతూ, ఆడంబరాలకు దూరంగా మసలుతూ, ప్రాలుమాలకుండా సోమరితనాన్ని వదలి అనుక్షణం తన పనితాను సాగిస్తూ, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచినా, కీర్తి కండూతి లేని విజ్ఞానమూతి పాములపర్తి. వీరిని సదాశివ రావు అనడం కన్నా సదాశాయ రావు అంటే బాగుంటుందేమో!

మనిషి పీలగా ఉన్నా, మేలైన ఆలోచనలతో కార్యదీక్షాదక్షుడైనాడు. నిరాడంబరతతో దర్శనమిచ్చినా, లోకాన్ని తన మేధతో స్పర్శించడం, తన కలంతో నిజాల్ని, నిగ్గుల్ని వర్షించడం, ఉపన్యాసాలతో ఆకర్షించడం చేస్తారు.

వరంగల్లు (మట్టెవాడ ) లో 1920 సం|| న జన్మించిన వీరు హన్మకొండ కాలేజేట్ హైస్కూలులో విద్యాభ్యాసం గావించారు. విద్యార్ధి దశలోనే చురుకైన ఆలోచనలు గల్గిన చురుకైన విద్యార్ధిగా గుర్తింపబడ్డారు. అప్పుడు హైదరాబాద్ రాజకీయ వాతావరణం భయానంకంగా ఉండేది. ‘ఆజాద్ హైదరాబాద్’ నినాదాలు విజ్రింభించేయి. వాటికి తోడు రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల హా హా కారాలు మిన్ను ముడుతుoడేవి. కదిలి అదిలించే మనస్తత్వం గావున విద్యార్ధి దశలోనే జాతీయోద్యమ ప్రభావ ప్రేరిరుతుడై ఇంటర్మీడియట్ స్థాయి లో కాలేజీని బహిష్కరించి నాగపూరులో తన చదువు కొనసాగించారు.

ఆంద్ర మహా సభ, గ్రంధాలయోద్యమం, ఆర్య సమాజ్ ఉద్యమాలలో పాల్గొని సాహిత్యం, కళలను ప్రోత్సహించారు. ప్రజలలో పోరాట స్ఫూర్తిని, దీప్తిని కలిగింపచేసారు. ఆనాటి పారతంత్ర్య దుర్గతిని ఎదిరించుటకై అతివాదం అవసరమని నమ్మి స్వాతంత్ర్య సమరంలో అజ్ఞాత పోరాటానికి విద్యార్ధులను, యువకులను మరెందరినో ప్రేరేపించారు.

1944 లో ఓరుగల్లులో కాకతీయ కళాసమితి నేర్పాటు జేశారు. వార్షికోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారు. సాహిత్య కళా పోటీలను కూడా నిర్వహించి ఎందరో ఆనాటి యువకులుకు ప్రోత్సాహాన్ని కలిగించారు. కాళోజి నారాయణ రావు, కాశీనాధం, వెంకట రామారావు, గార్లపాటి రాఘవరెడ్డి మున్నగు మహామహులెందరో కళా సమితికి బాసటగా నిలిచారు, భాగస్వములైనారు. వీరు వరవిక్రయం, రామదాసు, మధుసేవ, ప్రతాపరుద్రీయం, తెలుగుతల్లి, చింతామణి మున్నగు ఉత్తమ నాటకాల్ని కూడ ప్రదర్శించారు.

సంగీత రంగాన్ని కూడా వీరెంతో అధ్యయనం జేశారు. ఎన్నో గాన సభలను నిర్వహించారు. ఆ కళామతల్లికి కైమోడ్పుగా యెందరో గాన విద్వాంసుల గోష్ఠులు నిర్వహించి అనేకులకు సన్మానాల నేర్పాటుజేశారు. ఆ విధంగా సన్మానిమ్పబడిన వారిలో ద్వారం వేంకటస్వామినాయుడు గారు, బాల మురళీకృష్ణ గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, టి.టి. సీత గారు, పల్లవి సరస్వతి గారు మున్నగు యెందరో విద్వాంసులున్నారు.

తెలంగాణా లో రెండవ తెలుగు పత్రికగా వెలుగొందిన ‘కాకతీయ’ పత్రికను నడిపిన ఘనత వీరికే దక్కుతుంది. ఈ పత్రికా నిర్వహణలో మాజీ విదేశాంగ శాఖా మాత్యులు శ్రీ పి.వి. నరసింహారావు గారు కూడా వీరితో కలిసి పనిజేసారు. ఈ పత్రిక పోలీసు చర్యకు ముందు మూడేళ్లు, వెనుక మూడేళ్లు నడుప బడింది. ఆ రోజుల్లో జనం లో చైతన్య స్ఫూర్తిని పెంచగలిగే రచనల్ని గుప్పించడం, అలాంటి రచనల్ని సమీకరించి వాటి సందేశాన్ని జనంలోకి చొప్పించడం అనే విధి బాధ్యతలు అంత సులభమైన పనులుగావు.

పోలీసు చర్య, అనంతరం కమ్యూనిస్టులను ‘కనిపిస్తే కాల్చివేత’ ధోరణిలో పోలీసు ఉత్తర్వులు జారీయైనాయి. నాటి మిలిటరీ అధికారులు ముష్కర కర్కశులు, నంజప్ప అనే అధికారి దారుణ మారణకాండను సృష్టిస్తున్న వేళ, జనం భయం భయంగా దయనీయంగా దౌర్జన్యాలకు బలియౌతున్న వేళ, తుపాకి గుళ్ళకు గురి అవుతున్న వేళ, ప్రజలకోసం నేనున్నానని ఆ రాక్షసత్వాన్ని మొండిగా ఎదురొడ్డి జనంలో చైతన్యాన్ని దండిగా కలిగించిన ధైర్యశాలి, శ్రీ సదాశివరావు గారు. ఆ రోజులలో తెలంగాణా ప్రజల పౌరస్వాతంత్ర్యానికి కాకతీయ పత్రిక ఆందోళన సాగించింది.

శ్రీ పాములపర్తి సదాశివ రావు గారు కొద్ది కాలం అభ్యుదయ రచయితల సంఘంలో పని జేసారు. వీరు ‘చరిత్ర, సంస్కృతి, కళ’, తత్వశాస్త్ర ప్రాధమిక పాఠాలు, భారతీయ సాహిత్య పరిశీలన, అభ్యుదయ గీతాలు, మరియూ 1857 లో జరిగిన గదర్ విప్లవం పై గ్రంధాలు వ్రాయడం తోపాటు జ్ఞాన సిద్ధాంత మనే మరొక ఉద్గ్రంధమును వెలువరించారు. (పై సమాచారం శ్రీ టి. శ్రీరంగస్వామి గారి వరంగల్లు రచయితల వాఙ్మయ జీవిత సూచిక లో లభ్యమయ్యింది). కాని, ఆ ప్రతులేవీ ప్రస్తుతం దొరకడం లేవు. వారు కూడా వాటిని భద్రపరిచే పని చేయలేదు.

వీరు చైనా దాడి సందర్భంగా “విశ్వజ్యోతి” పత్రిక లో వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికలల్లో పునర్ముద్రణల ద్వారా విశేష ప్రచారంలోకి వచ్చినవి. క్యూబా విప్లవం ముఖ్యంగా రెజిస్ డెబ్రీ భావాలు అనే రచనలను విశ్వజ్యోతి పత్రిక ద్వార ప్రచురించి విప్లవకారులకు మార్గదర్శనం గావించారని ఆ పత్రిక సంపాదకులు శ్రీ కే. నరసింహా రెడ్డి గారన్నారు.

నేడు ప్రప్రధమ సోషలిస్టు దేశమైనా సోవియట్ లో గోర్బచేవ్ నాయకత్వాన మన్నింపబడుతున్న కమ్యూనిస్టు పార్టీలోని ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే అంశాల్ని శ్రీ పాములపర్తి వారు “సందేశం” పత్రిక లో ‘వ్యక్తి స్వాతంత్ర్యం పై చర్చ’ అనే రచన ద్వార ఆనాడే రేకెత్తించారు. కాని కొందరు నాయకులు ఈ ఆలోచనలనీ ప్రతిఘటించడం లాంటి అనుభవాలు జరిగాయి. అప్పటి నుండి తానూ పార్టీ రాజకీయాలకు దూరమవ్వడం జరిగింది.

వీరు భాషా రాష్ట్రాల వాదనను బలపరచారు. విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందానికి ప్రభుత్వం తిలోదకాలిచ్చిన సందర్భంలో దాని వివరాలను వెలుగులోకి తెస్తూ, తెల్నగ్నా హక్కుల ఉద్యమం కోసం వారు వ్రాసిన ఒకే ఒక్క వ్యాసం ఒరుగాల్లునే గాక తెలంగాణా అంతటా ముసురుకొని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వర్గాలను హడలెత్తించింది, గడగడలాడించింది.

వీరి కలానికున్న శక్తి గొప్పది. వరంగల్లు పురపాలక సంఘం తొలి ఎన్నికలు జరిగే సమయాన కాంగ్రెస్ నాయకులను వీరు తన కలంతోను, ప్రజాబలంతోను తీవ్రంగా యెదుర్కొన్నరు. పౌర సంఘాన్ని స్థాపించి శ్రామిక శక్తుల ప్రతినిధుల గెలిపించుకున్నారు.

శ్రీ పాములపర్తి గారు ఉత్తమ జర్నలిస్టు. ఎన్నో పరికలలో వారి వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ప్రాచీన సాహిత్యంతో సహా, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలైన ఎలక్ట్రానిక్ వంటి విషలాలు గూడ వీరికి పరిచయాలు. శాస్త్రీయ సంగీతం పట్ల అత్యంత అభిమానం ఉంది. యే విషయాన్నైనా సమూలమైన, సమగ్రమైన అవగాహనతో వివరించగలరు. వీరి కలం యెందరో మహా మహులైన రాజకీయనాయకులు, మంత్రుల, రచయితల సభా ఉపన్యాసాల్ని తయ్యారు చేసింది. ఎన్నో పత్రికల్లో రచనల్ని మెరుగులు తీర్చింది. అయితే ఆ కలానికి అనేక పేర్లున్నాయి. అసలు పేరు వెల్లడించడంలో ఆ కలానికి ఆసక్తి ఉండదు.

వీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక మంది పండితుల ప్రశంసలను చూరగొన్నారు. ప్రపంచ విజ్ఞాన రంగంలో గణుతికెక్కారు. పోతన ఉత్సవాలలో కార్య విధానాలను తీర్చి దిద్దారు. విద్యారణ్య విద్వత్ గోష్టిని నిర్వహించారు.

కార్మిక రంగం లోను శ్రీ సదాశివరావు గారి సేవ ఉంది. ఆజంజాహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యదర్శిగా ఆయన ఒక జయప్రదమైన సమ్మెను నిర్వహించారు. చేనేత, గీత పారిశ్రామిక సహకార సంఘ ఉద్యమాలలో వీరి సారధ్య సలహాలు ఎన్నో విజయలాకు దారులు తీసాయి.

తాను నమ్మిన దాని కోసం అవిశ్రాంతంగా శ్రమించడం, నిస్వార్ధతతో పనిచేయడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. వీరు ఆంద్ర తెలంగాణాల లోని పలు జిల్లాలలో రాజకీయ శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కమ్యూనిస్టు ఉద్యమాలలో నేరుగా పాల్గొన్నారు.

వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారు. మెడికల్ కాలేజీ (వరంగల్లు) లో జరిగిన కొన్ని వర్ణాంతర వివాహాలకు వీరి ప్రోత్సాహం ఉంది. భూసంస్కరణల ఉద్యమానికి చేయూతనిచ్చి, భూసంస్కరణల చట్టం కొరకు ఆందోళన సాగించారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే ఉద్యమంలో శ్రీ తెన్నేటి విశ్వనాధం గారితో కలిసి పని చేసి జైలుకు వెళ్ళారు.

ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొన్నారు. వరంగల్ మహబూబియా ఉన్నత పాఠశాలను నెలకొల్పటంలో కీలకపాత్ర వహించారు. ‘రాయిస్టు ఉద్యమం’, ‘మంత్రుల ఆడంబర వ్యతిరేక ఉద్యమం’ గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి ‘నాస్తికోద్యమం’ లాంటి కొన్ని ఉద్యమాలను వీరు బలపరిచారు.

శ్రీ రావుగారూ పౌరహక్కుల పరిరక్షణకు అగ్రగామిగా నిలిచి మానవహక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వ్యక్తి స్వాతంత్ర్యం కోసం పాటుపడుతూ, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేక పోరాటాలను సర్వదా బలపరుస్తూ తమ రచనల ద్వారా, సలహాల ద్వారా, బహుముఖాలుగా ప్రోత్సహిస్తున్నారు.

పౌర హక్కుల అమలును ఉల్లంఘించే ప్రభుత్వ ధోరణి అజ్ఞాత ప్రజా పోరాటాలకు, హింస ప్రతిహింసల దారుణానికి దారి తీస్తుందని వీరు చెబుతూ ఉంటారు.

“ఐక్యరాజ్య సమితిలో అమలయ్యే అధికారిక పధ్ధతి బూటకం, అది ఆచరణలో విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంద”ని వెక్కిరిస్తారు.

“వ్యక్తికి భావ స్వాతంత్ర్యం అవసరం, అది షరతులతో కూడుకొని ఉండరాదు. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్య అభివ్యక్తిగా ఉండి అన్ని రంగాలనూ ఆవరించే అవకాశం గుర్తించబదాల” ని ఉద్భోదించారు.

“ఇజాలను తెలుసుకోవడం అవసరమే, అయినా రాజకీయ పార్టీలు వాటిని అమలుపరచావు. కాబ్బట్టి ఆ పార్టీలనీ ప్రజలు అదుపు చెయ్యడానికీ అవకాసం ఉండాలి. అలాంటి ప్రజా ఉద్యమాలు అనివార్యం” అంటూ భావిస్తారు.

నేటి పత్రికలూ కేవలం వ్యాపార పత్రికలైనాయి. అనేక రంగాల్లో అవి సంక్షేమ విలోకనను సరిగా ప్రతిబింబించలేని స్థితి లో ఉన్నాయంటూ పత్రికాలోకాన్ని యీసడిస్తారు.

కవిత్వం ద్వారా సమాజం మారదు. కవి సమాజానికి అతీతంగా కూడ చూడగలగాలి. సాహిత్యంలో మానసిక జీవనం – దాని అనుభూతి వివరణ అనే మానవతా దృక్పధానికి ప్రాధ్యానత ఉండాలి అంటూ విశ్లేషిస్తారు.

ప్రజల సమస్త జీవిత రంగాల్లో వ్యక్తుల ఆత్మవిశ్వాసం, స్వతంత్ర్య స్వచ్చంద పాత్ర, కార్యకుశలత అనువాటికి గుర్తింపు పెంపోందాలనేది వీరి ఆశయం.

పేదరికానికి, యేకాకిత్వానికి, త్యాగాలకు ఆయత్తం కాలేని స్వార్థ పరత్వ శక్తులు సంఘ శ్రేయస్సును సాధించలేవని వీరు విశ్వసిస్తారు. పాలక వర్గ పోషణ యెపుడూ స్వాతంత్ర్య విస్తరణకు ప్రతికూల పాత్రకే దారి తీస్తుందని వీరి అభిప్రాయం. రాజకీయ పార్టీలు సామూహిక భావాలలోనూ, పార్టీ ఉద్యమాలలోనూ, ఎన్నికల సంరంభంలోనూ సాంఘిక వాస్తవ గుర్తింపు ‘మిధ్య’ మాత్రమేనని వీరు భావిస్తారు. సాంస్కృతిక చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే విధాన అనుసరణ కొరకు కృషి జరగాలని అభిలషిస్తారు.

పరిపాలనా వ్యవస్థకు ప్రజామోద ప్రణాలికా కార్యక్రమాలలో ప్రజల చొరవకు అవకాశం ప్రాధాన్యత చెందడం అవసరమని వీరి ఉద్ధేశ్యం; సంకుచిత తత్వంతో గాక విశాల దృక్పదం తో అన్వేశానాత్మక ఆచరణ ద్వారా మాత్రమె అభివృద్ధి సాధ్యపడుతుందని వీరు స్వాతంత్ర్య శీలతను వ్యాఖ్యానిస్తారు. పై విధంగా తమ ప్రత్యేకమైన విలోకనతో వారు జీవితాన్ని జీవిత సమస్యలను అర్థం చేసికోనడానికి ప్రయత్నిస్తారు.

కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించింది. దేశంలో జాతీయోద్యమ కాలనాటి సాంస్కృతిక రంగంలో కృషి చేసిన కొలది మంది ఉత్తమ వ్యక్తులలో వీరిని గుర్తించి వీరికి గౌరవభ్రుతి సౌకర్యాన్ని మంజూరు చేసింది.

ఏకశిలా ప్రతిభాపాటవాలకు, సాహిత్య సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన వీరి రచనలన్నీ ముద్రణలో వస్తే నవతరానికి ఉపయోగకరంకాగాలవు. ప్రభుత్వం కాని, విశ్వ విద్యలయలాలు కాని ఈ పనిని చేపట్టవలసి ఉండి. అప్పుడే సదశివరావుగారి సదాశాయాల్ని గౌరవించినవారం అవుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami