Courtesy: కోవెల సువ్రసన్నాచార్య
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్క్సియ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమ్యూనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమ్యూనిస్టుల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.
నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము
పుడమితల్లికి పూజచేద్దాము
వీరాధివీరులౌ శ్రీరామచంద్రులను
కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను
జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను
కన్నతల్లికి హారతిద్దాము
కన్నీరు కడిగి పూజిద్దాము
నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల . . . .
పాలునీరుగ మనము కలసి పోయిననేల
కలసి పోయిన మనము కరగిపోయిననేల
జంట నాగళ్లతో బీళ్లు దున్నిన నేల
నీళ్లు గొట్టిన నేల కాపుగాచిన నేల
రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల
గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి
శాంతి ఆయుధముతో స్వాతంత్య్రపథములో
సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి
ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి
కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల
చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల
మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల
నిండ నూరేండ్లయి కండ్లుమూసేటపుడు
పట్టుపాన్పులాంటి గుండెపై జోకొట్టి
జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే. 42,43)
తమ ఉద్యమం రోజుల్లో `దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషూలోయ్’ అన్న గేయాన్ని `వందేమాతరం’ గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమ్యూనిస్టులు వాడుకున్నారు. ఈ గేయం సంస్కరణోద్యమాన్ని బలపరచేది. స్వాతంత్య్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్య్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన ఔన్నత్యాలు ప్రేరకాలు. దేశం ఒకవిధంగా జగన్మాతృ రూపమైంది. గురజాడ ఆంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, `మంచిగతమున కొంచెమేనోయ్’ అన్నవాడు. పాములపర్తి సదాశివరావు రచన కమ్యూనిస్టులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పథాన్ని ఎత్తిచూపింది. గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.