KakatiyaPatrika.com Header Image

అలనాటి ‘కాకతీయ కళాసమితి ‘ నిజమైన తెలుగు కళామతల్లి!

శాస్త్రీయ సంగీతం, సారస్వత రంగం లో వున్న ఉత్సుకతతో శ్రీ పాములపర్తి సదాశివ రావు గారు 1945 లోనే వరంగలులో “కాకతీయ కళాసమితి” అనే ఒక సంగీత సారస్వత సంస్థను నెలకొల్పారు. ఈ కళా సమితి కార్యాలయం స్థానిక శ్రీ రామలింగేశ్వర ఆలయంలో వుండేది.

ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ సమితి “ శ్రీ త్యాగరాజ మహోత్సవాలు” నిర్వహించేది. తొలుత ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు, పిదప ఐదు రోజుల పాటు జరిగేవి. ఈ ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ వరంగల్ ప్రజలకు పండగ రోజులే! దాదాపు 15 సంవత్సరాలు ఈ కళాసమితి వరంగల్ ప్రజలకు సంగీత సాహిత్య మధుర రుచులను చూపించింది.

కాకతీయ కళాసమితి ఆ రోజుల్లోనే సుమారు 50 మంది విద్యార్థులతో ఒక సంగీత పాఠశాలను నిర్వహించేది.

ఇంకా (1) శ్రీ రామనవమి, (2) దీపావళి, (3) స్వాతంత్ర దినం,(4) గోకులాస్టమి (5) గణేష ఉత్సవాల సందర్భంగా ప్రతి యేడూ 5 సంగీత వాద్య కార్యక్రమాల్ని నిర్వహించేది.

ఈ కళాసమితి కార్య కలాపాల్ని మెచ్చుకున్న అలనాటి హైదరాబాద్ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా 1950-51 నుండి 500/- రూపాయల గ్రాంటును ప్రతి యేడూ ఇచ్చేది.

ఈ కళా సమితి కార్యాలయాన్ని ఆ రోజుల్లో మద్రాసులో అమెరికన్ కాన్సలేట్ జనరల్ గా వ్యవహరించిన “పాల్ గ్రైంస్” స్వయంగా వచ్చి సందర్శించారు.

అలనాటి కాకతీయ కళాసమితి కార్యవర్గ సభ్యుడైన శ్రీ దేవులపల్లి దామోదర్ రావు గారి మాటల్లో చెప్పాలంటే …

“శ్రీ సదాశివరావు గారు నాకంటే రెండున్నర సంవత్సరాలు వయస్సులో పెద్దవారు. 1945 నుండి మా పరిచయం బాగా వృద్ధి చెందింది. ఆ రోజుల్లోనే వరంగల్ లో కాకతీయ కళాసమితి యను ఒక సంస్థను స్థాపించుటకు మూలకారకుడు. ఆయనకు చేదోడువాదోడుగా వుంటూ, శ్రీ రాయపరాజు వేంకట్రామారావు గారు సుమారు పది సంవత్సరాలు కళాసమితి అధ్యక్షులుగా వున్నారు. శ్రీ సదాశివరావు కార్యదర్శిగాను, శ్రీయుతులు కక్కెర్ల కాశీనాధంగారు, పులిపాక కోటిలింగంగారు, శ్రీరాం చంద్రమౌళిగారు, బెలిదె ముకుందంగారు, తమ్మడి వీరమల్లయ్య గారు, నేను (అంటే దామోదర్ రావుగారు)మున్నగు వారు నిర్వాహకులుగా వున్నారు.

అలనాటి పుర ప్రముఖులు ఆచార్య చందాకాంతయ్య శ్రేష్ఠిగారు, ఆకారపు చెన్నయ్య గారు, సిద్దంశెట్టి రామనాధం గారు, బొల్లం లింగయ్య గారుమొదలగు స్థానిక వాణిజ్య ప్రముఖుల అండదండలు మరియు ఆనాటి వరంగల్ పౌరుల ఆదరాభిమానాలు, ఆర్థిక ప్రోత్సాహం కళాసమితి కార్యక్రమాల్ని విజయవంతం చేసాయి.

వీరందరినీ కదిలించి కళాసమితి నిర్వహించిన అనేక కార్యక్రమాలను తమవిగా భావించి తోడ్పడుటకు ఉత్తేజితులను చేయుటలో శ్రీ సదాశివ రావుగారి కృషి ప్రముఖమైనదని చెప్పుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కళాసమితియే తానుగా, తానే కళాసమితిగా ఎప్పటికప్పుడు దాని దిశా నిర్దేశనములు నిర్ణయిస్తూ పాటుపడి ఒక దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగిన నాయకుడిగా అందరిచేత శ్లాఘింపబడ్డ ప్రముఖ వ్యక్తి శ్రీ సదాశివరావు గారు…”

ఇంకా ఈ కళాసమితిలో చురుకుగా పాల్గొన్నవారిలో ముఖ్యులు శ్రియుతులు గార్లపాటి రాఘవరెడ్డి గారు,కాళొజీ నారాయణరావుగారు, చౌడవరపు రాజా నరేంద్రగారు, ప్రముఖ చిత్రకారుడు మల్లారెడ్డిగారు, పల్లా రామకోటార్యగారు, ఉదయరాజు వెంకట రంగారావుగారు, కొండబత్తిని జగదీశ్వర రావు గారు, నరసింహస్వామి గారు, దివ్వెల హనుమంత రావు గారు తదితరులు.

ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీ త్యాగరాజ మహోత్సవాల ప్రత్యేకత ఏమంటే, మిగతా గాన సభలలో నిర్వహించునట్లుగా కేవలం ‘సంగీత సభ ‘లకే పరిమితం కాకుండా వివిధ కళా రంగాల కార్యక్రమాల నిర్వహణ!

ఐదు రోజుల కార్యక్రమాలు ఈ విధంగా వుండేవి:

(1) ప్రముఖ కళాకారులచే సంగీత కార్యక్రమాలు: శ్రీయుతులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, బాల మురళీకృష్ణ గారు,దంతాలపల్లి పురుషోత్తమ శాస్త్రి గారు, నల్గొండ వాస్తవ్యులు శ్రీ రామానుజాచార్యగారు,పిఠాపురం వాస్తవ్యులు పురుషోత్తమాచారి గారు,నెల్లూరు వాస్తవ్యులు జీపీఆర్ విఠల్ రావు గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు రాజా జగన్నాథ దేవ్ వర్మ గారు, మద్రాసు వాస్తవ్యులు పురాణం ఫురుషోత్తమ శాస్త్రిగారు, హైదరాబాదు నుండి హిందూస్తానీ సంగీత విద్వాంసుడు దంతాలే గారు మున్నగు ఉద్ధండులతో పాటు స్థానిక హిందూస్తానీ, కర్ణాటక సంగీత కళాకారులచే ప్రతి రోజూ ఒక సంగీత కార్యక్రమం

(2) ఏకాంకిక నాటిక పోటీలు: తెలంగాణా లోని వివిధ ప్రాంతాలనుండి నాటక సంస్థలు ఈ పోటీలలొ పాల్గోనేవి. 1953 వ సంవత్సరం జరిగిన ఉత్సవాలలో అలనాటి ప్రఖ్యాత మోనోయాక్టర్ శ్రీ చంద్రశేఖరం గారు (నెల్లూరు వాస్తవ్యులు) ప్రత్యేక కార్యక్రమం ఇవ్వడం జరిగింది.

(3) స్థానిక విద్యాసంస్థల నుండి ఔత్సాహిక పెయింటర్లు గీసిన పెయింటింగులు (వాటిలో ఉత్తమమైన మూడు పెయింటింగులకు బహుమతుల నివ్వడం), వాటితో పాటు ప్రముఖ చిత్రకారులు (శ్రీయుతులు కొందపల్లి శేషగిరి రావు గారు, సిద్దిపేట వాస్తవ్యులు కె. రాజయ్య గారు, పీ. టీ. రెడ్డిగారు, మల్లారెడ్డిగారు, సోమేశ్వరరావుగారు మున్నగువారు) గీసిన పెయింటింగులతో ఒక ‘ఆర్ట్ గాలరీ’ని నిర్వహించడం.

ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ‘ వరంగలులో వున్న అన్ని విద్యా సంస్ఠలనుండి పెయింటింగ్స్ సేకరించి, ఆర్ట్ ఎగ్జిబిషన్ అనంతరం వాటిని తిరిగి విద్యా సంస్ఠలకు మళ్ళీ తిరిగి ఇచ్చే బాధ్యత నాపై పెట్టారు…’అని ఒక సందర్భంలో తెలపడం జరిగింది.

(4) స్థానిక విద్యాసంస్థల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ఫ్యాన్సీ డ్రెస్సు, క్లాసికల్ మరియు లైట్ మ్యూజికులో పోటీలు నిర్వహించడం.

(5) ప్రత్యేకంగా మహిళలకు సాంఘిక, సాహిత్య, సంగీత అంశాలపై ‘చర్చా వేదిక ‘ నిర్వహించడం

శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో … “ ఈ కళా సమితి కార్యక్రమాల్లో శ్రీ పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించే వారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami