KakatiyaPatrika.com Header Image

గుడిలో ప్రమాణాలు – సరిక్రొత్త రాజకీయ విన్యాసాలు

ఆకాశ విహార నారదుడు ఏ గుడికి ముందు పోవాలా అని
సారించాడు దృష్టి భూగోళం వైపు
జూం చేసాడు భారతం వైపు
మరికొంచం జూం తెలంగాణా, ఆంధ్ర వైపు


‘ఏమిటా కమ్ముకొస్తున్న పొగ?’
అనుకున్నాడు దట్టంగా తన వైపే దూసుకొస్తున్న
ఆ అస్పష్ట మబ్బు తునకల సముదాయాన్ని చూసి
‘కొంపదీసి కొరొనా దండయాత్ర కాదు గదా స్వర్గం పైకి?’
‘ఐనా మాస్కు లేకుండా ఎందుకు నాకీ తొందర పయనం?’
కంగారులో బయటకే అన్నాడు మనస్సులో మాట,
‘’ఓ కంగారు కలహ భోజనా,
ఆ వచ్చేది కొరొనా కాదు, కొరొనా పీడిత ప్రజలూ కాదు
నీ ఆకలి తీరడానికి ఏ ఏ గుళ్ళకు వేశావో నీ టూర్ ప్రోగ్రాం
ఆ యా గుళ్ళ దేవాది దేవుళ్ళు!
ఇక నీ భోజనం గతి అంతే
మనము తిరిగి వెనక్కు పోవాలి మరంతే
అంది మహా తియ్యగా మహతి వీణ


నారద ముని మాట్లాడేలొ గా
ఆ దేవ సమూహం దగ్గరైంది.
కొందరు ఇటూ, కొందరు అటూ
ఆతృత నిండిన పరుగులతో…


ఒక రిద్దరిని ఆపాడు ఆ మహర్షి
‘ఏమిటీ పరుగులు, ఏమిటి మీ ముఖంలో ఆ కలవరం?”
అడిగాడు త్వరత్వరగా!


‘స్వామీ, ఇంకో గంటలో మా కుంది గండం
దాన్ని తప్పించుకోవడానికి ఈ పరుగు…
ఎక్కడ దాక్కోవాలో తెలియక చస్తున్నాం’
మహర్షి నోరు విప్పేలోగా అక్కడ వుంటేగా?
మళ్ళీ గమ్యం తెలియని పరుగులు…


మరో ఇద్దరిని ఆపి బలవంతంగా
తెలుసుకున్నాడు వారి ఉరుకు పరుగుల కారణం!


ఆయనెవరో ఒక చిరు ప్రజా ప్రతినిధి అట
అపుడెప్పుడో మద్యం మత్తులో కారు నడిపి
ఒక ప్రజానాయకుడి విగ్రహాన్ని గుద్ది కూల్చేసేడాట
ఈ అభియోగం చేసింది ఆయన ప్రత్యర్థి పార్టీ చిరు నాయకుడు


‘అదంతా అబద్ధం నా పై అసూయతో
చేస్తున్న అసత్యారోపణ
కావాలంటే మన వూరి ఆ దేవ దేవుని
గుడిలోచేస్తాను ప్రమాణం
దమ్ముంటే రమ్మనండి’
ఇది ఆరోపణపై సవాలు!


‘దమ్మూ ధైర్యం నా సొత్తు, నిన్ను చేస్తాను చూడు చిత్తు
నీ వన్న రోజుకి ఆటైముకు నేను కూడా హాజర్”
ఇది ఆరోపణాస్ర్త్ర జవాబు…


ఇంకేం హమేషా ప్రజల గుండె చప్పుళ్ళైన
టీ వీ వార్తా ప్రసరణలు
చేసాయి ఈ ప్రమాణాల చందాన్ని
తమ తమ వీలైనట్లు రసకందాయం


మరో గంటలో ఆ గుడికి ఆగమనం
ఆ నాయకం ప్రతినాయక ద్వయం
వారి వెంట వంది మాగధ బృందం
ఇలా ఈ ఆరోపణలకేసులెన్నో
చేరాయి వివిధ గుడులెన్నో


ఎ గుడి ఐనా రాతి విగ్రహం దేవుడే కాని
భక్తుల కోరికలను తీర్చే సుతి మెత్తని
దయార్ద్రహృదయ భగవంతుడాయె
ఇద్దరు భక్తుల జగడపు తీర్పు
చెప్పే న్యాయ శాస్త్ర అర్టికిల్
అప్ప్లై చేయమంటే ఎలా?


అందుకే అర్జెంటుగా విగ్రహం లోంచి దేవుళ్ళు మాయం
ఆ పరమశివుడో, ఆ ఆదివిష్ణువో వారి గమ్యం
ఈ గడ్డు సమస్యకు వారు మాత్రమే వుంటారని తమకు రక్షా కవచమని
ఈ చిక్కు తీర్పుకు వారే చూపిస్తారొక పరిస్కారమని
***
తన ఆకలి తీరదన్న ఆక్రోషంతో
‘నేను మీ తో వస్తాను పదండి’ అన్నాడు వారితో
వెనుదిగాడు ఆ కలహ భోజనుడు ఉస్సూరుమంటూ
‘ఈ క్రొత్త ప్రమాణాల రాజకీయం బాగుందం’టూ

***
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు










Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami